ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీల్లో మిసెస్ ఇండియా ఒకటి. తాజాగా గుజరాత్‌లోని ఉదయపూర్‌లో ‘మిసెస్ ఇండియా – 2021’ గ్రాండ్ ఫినాలే జరిగింది. అయితే.. విజయవాడలోని పటమటకు చెందిన బిల్లుపాటి దుర్గా శివనాగమల్లేశ్వరి ఈ ‘మిసెస్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకొని తెలుగు ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని శివనాగమల్లేశ్వరి తండ్రి సుంకర దుర్గాప్రసాద్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఈ గుడ్ న్యూస్ తెలియగానే మిసెస్ ఇండియా కుటుంబ సభ్యులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేజెంట్స్ ప్రైవేట్ ఇండియా ఆధ్వర్యంలో మొత్తం నాలుగు రోజులు పాటు ఈ మిసెస్ ఇండియా- 9వ సీజన్ పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది మహిళలు ఈ అందాల పోటీల్లో పాల్గొనగా.. 12 మంది ఫినాలేకి ఎంపికయ్యారు. తాజాగా జరిగిన టైటిల్ పోరులో మల్లిక(శివనాగమల్లేశ్వరి) మిసెస్ ఇండియా కిరీటం కైవసం చేసుకున్నారు.
ప్రస్తుతం మిసెస్ ఇండియా టైటిల్ గెలిచిన మల్లిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ కలిగి ఉండటం విశేషం. శివనాగమల్లేశ్వరి ఇదివరకు ‘శ్రీమతి అమరావతి-2019’ టైటిల్ కూడా గెలుచుకున్నారు. మరోవైపు ‘మిసెస్ ఇండియా వరల్డ్ 2021’ టైటిల్ ని శ్రీమతి నవదీప్ కౌర్ అందుకున్నారు. మీరు కూడా ఈ మిసెస్ ఇండియా విన్నర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.