విపక్షాల నిరసనల మధ్య ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులను అనుసంధానం చేసే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు – 2021 లోక్‌సభలో ఆమోదించబడింది. ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC)తో ఆధార్‌ను లింక్ చేయాలని బిల్లు కోరింది. ఈ బిల్లును కాంగ్రెస్, ఏఐఎంఐఎం, బీఎస్పీ తదితర ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.
ఓటర్ల జాబితాకు ఆధార్‌ను అనుసంధానం చేస్తే అది పౌరుల రాజ్యాంగ హక్కులను, వారి గోప్యత హక్కును ఉల్లంఘించడమేనంటూ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరించిన రిజిజు, బిల్లులో భాగమైన వివిధ ప్రతిపాదనలను.. లా అండ్ పర్సనల్ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే సూచించి, సిఫార్సు చేసిందని తెలిపారు. ఈ బిల్లు ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందని మంత్రి అన్నారు.ఎన్నికల సంస్కరణల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గతంలోనే ఆమోదం తెలిపింది. 2021 ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, డూప్లికేషన్‌ను తొలగించడానికి ఆధార్ మరియు ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ లింక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షాల నిరసనల మధ్య సోమవారం లోక్‌సభలో బిల్లు ఆమోదించబడింది.
బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. ‘దేశంలో బోగస్ ఓటింగ్‌ను ఈ చట్టం అంతం చేస్తుందని, ఎన్నికల ప్రక్రియను మరింత విశ్వసనీయంగా మారుస్తుందని’ అన్నారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీలకు చెందిన ఎంపీలు వెల్ ఆఫ్ ద హౌస్‌లో నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు.