ఐపీఎల్ 2022 ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుంది. కాగా ఈ సీజన్ కోసం ఆటగాళ్ల మెగా వేలం త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లు రిటెన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించాయి. ఒక రిటెన్షన్ తర్వాత మిగిలిన ఆటగాళ్ల నుంచి ఐపీఎల్ 2022లో కొత్తగా వస్తున్న రెండు జట్లు లక్నో, అహ్మాదాబాద్ ఫ్రాంచైజ్‌లు చేరో ముగ్గురు ఆటగాళ్లను మెగా వేలానికి ముందు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఆరుగురు ఆటగాళ్లు వేలానికి వెళ్లకముందే కోట్ల ధర పలికే అవకాశం ఉంది. రెండు కొత్త జట్ల కన్ను పడ్డ ఆటగాళ్ల జాబితాను ఒకసారి చూద్దాం..
కేఎల్ రాహుల్..
ఐపీఎల్ 2021 సీజన్ వరకు పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఆ జట్టు రిటెన్ చేసుకోలేదు. అతన్ని రిటెన్ చేసుకునేందుకు జట్టు యాజమాన్యం ప్రయత్నించిన్పటికీ రాహుల్ జట్టు వీడేందుకే సిద్ధమయ్యాడు. దీంతో చేసేదేం లేక జట్టు అతన్ని రిటెన్ చేసుకోలేదు. కేఎల్ రాహుల్‌కు లక్నో ఫ్రాంచైజ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. దాదాపు రూ.17 నుంచి రూ.20 కోట్లు చెల్లించి రాహుల్‌ను లక్నో సొంతం చేసుకునున్నట్లు తెలుస్తుంది. అందుకే రాహుల్ పంజాబ్‌ను వీడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 94 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 3273 పరుగులు చేశాడు.
శ్రేయస్ అయ్యర్..
ఒక ఇంకో హాట్ కేక్ శ్రేయస్ అయ్యర్. ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్ చేసుకోలేదు. దీంతో శ్రేయస్‌కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌గా కూడా శ్రేయస్ జట్టును నడిపించగలడు కనుక అతన్ని కెప్టెన్‌గా కూడా తీసుకునే అవకాశం ఉంది. అహ్మాదాబాద్ ఫ్రాంచైజ్ శ్రేయస్‌ను దాదాపు రూ.12 కోట్లు పెట్టి దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 87 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 2375 పరుగులు చేశాడు.
డేవిడ్ వార్నర్..
సన్ రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్‌ను రిటెన్ చేసుకోలేదు. అంతకు ముందే వార్నర్‌ను కెప్టెన్‌గా తప్పించి, ఆ తర్వాత జట్టును కూడా తప్పించింది. దీంతో వార్నర్ ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడడం అప్పుడే ఖారారైంది. ఇప్పుడు అధికారికంగా వార్నర్ ఎస్‌ఆర్‌హెచ్ నుంచి బయటికొచ్చాడు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన డేవిడ్ భాయ్.. మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. దీంతో కొత్త ఫ్రాంచైజ్‌లు వార్నర్‌పై కన్నేశాయి. అతన్ని దక్కించుకుంటే ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌తో పాటు కెప్టెన్‌గా పనికొస్తాడని నమ్ముతున్నాయి. దీంతో వార్నర్ కోసం రెండు కొత్త జట్లు కూడా పోటీ పడుతున్నాయి. వార్నర్ దాదాపు రూ.12 నుంచి రూ.15 కోట్ల మధ్య ధర పలకొచ్చు. ఇప్పటి వరకు 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 5449 పరుగులు చేశాడు.
రషీద్ ఖాన్..
మరో మోస్ట్ వాంటెడ్ ప్లేయర్ వరల్డ్ నంబర్ వన్ స్పిన్నర్ రషీద్ ఖాన్. ఈ స్టార్ మ్యాచ్ విన్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్ చేసుకోలేదు. వేరే ఫ్రాంచైజ్ భారీ ఆఫర్ ఇవ్వడంతోనే రషీద్ ఖాన్ రిటెన్‌కు ఒప్పకోలేదని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఆరోపిస్తుంది. లక్నో ఫ్రాంచైజ్ దాదాపు రూ.16 నుంచి రూ.12 కోట్లు పెట్టి రషీద్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 76 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్ 93 వికెట్లు తీసి, 222 పరుగులు కూడా చేశాడు.
యుజ్వేందర్ చాహల్..
ఆర్సీబీ యాజమాన్యం స్పిన్నర్ చాహల్‌ను రిటెన్ చేసుకోలేదు. దీంతో చాహల్‌పై కూడా రెండు కొత్త జట్లు కన్నేశాయి. ఈ స్పినర్‌ను దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 114 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన చాహల్ 139 వికెట్లు తీసి 32 పరుగులు చేశాడు.
జానీ బెయిర్‌స్టో..
విధ్వంసకర బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టోను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్ చేసుకోలేదు. దీంతో ఈ ఆటగాడు కూడా వేలానికి ముందే అమ్ముడైపోయే అవకాశాలు ఉన్నాయి. దాదాపు రూ.6 నుంచి 10 కోట్లు పెట్టి బెయిర్‌స్టోను దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 28 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన బెయిర్‌స్టో 1038 పరుగులు చేశాడు.