హైదరాబాద్- భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పులు చెప్పడం, ఆదేశాలు జారీ చేయడం చేస్తుంటారు. కానీ సుప్రీం చీఫ్ జస్టిస్ మన హైదరాబాద్ పోలీసులకు ఓ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనది ఎంత మంచి మనసు అని అంతా ప్రధాన న్యాయమూర్తిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మన తెలుగు వారు ఎన్ వీ రమణ అని తెలుసు కదా. సుప్రీం కోర్టుకు సలవుల కారణంగా ఆయన వారం రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చారు. కుటుంబంతో సహా రాజ్ భవన్ లో ఉంటున్నారు.
అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి నిన్న బుధవారం ఎస్ ఆర్ నగర్ లోని తన సొంత ఇంటికి వెళ్లారు. రాజ్ భవన్ నుంచి ఆయన వెళ్లే సమయంలో ఆ దారి అంతా పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపి వేశారు. ఆ దారిలో వెళ్తున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ రమణ ఈ విషయాన్ని గమనించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వెంటనే హైదరాబాద్ పోలీసులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. ఇకపై తాను వెళ్లే దారిలో ఎప్పుడైనా సరే తన కోసం ట్రాఫిక్‌ను నిలిపి వేయకూడదని చెప్పారు. తన ఒక్కడి కోసం ఎంతో మంది వాహనాలను నిలిపివేసి ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని హైదరాబాద్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
వాళ్లందరు వారి వారి పనుల మీద బయటికి వెళ్తున్న సమయంలో అలా ట్రాఫిక్ నిలిపివేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని జస్టిస్ ఎన్ వీ రమణ అన్నారు. అందువల్ల తాను హైదరాబాద్ లో పర్యటిస్తున్న సమయంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి పోలీసులకు చప్పారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 19వ తేదీ వరకు హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో బస చేయనున్నారు. మొన్న యాదాద్రిని సందర్శించిన ప్రధాన న్యాయమూర్తి, ఆలయ పునర్ నిర్మాణం అధ్భుతంగా ఉందని కొనయాడారు.