ఇంటర్నేషనల్ డెస్క్- అంతరిక్ష యానంలో కొత్త అధ్యయనానికి తెర తీసిన ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ ఏడాది జులైలో అంతరిక్ష పర్యాటకాన్ని మొదలుపెట్టిన బెజోస్, ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్బిటాల్ రీఫ్ పేరుతో వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం అంతరిక్షంలో అమెరికా నాసాకు చెందిన స్పేస్ స్టేషన్ మాత్రమే ఉంది. నాసా ఐఎస్ఎస్‌కి 20 ఏళ్లు పూర్తికావడం, దానికి నిధులు 2030లో ముగియనుండంతో, తదుపరి దశ కాంగ్రెస్ నుంచి పొందే నిధులపై ఆధారపడి ఉంటాయి. ఇటువంటి సమయంలో కొత్త అంతరిక్ష కేంద్రం అవసరాన్ని కూడా గ్రహించినట్లు కనిపిస్తోంది. జెఫ్ బెజోస్ నిర్మించతలపెట్టిన ఈ అంతరిక్ష కేంద్రం విశ్వంలో రెండవది అవుతుంది.
సియార్రా స్పేస్, బోయింగ్, రెడ్‌వైర్ స్పేస్, జెనిసిస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో దీనిని చేపట్టనున్నట్టు బ్లూ ఆరిజిన్ ప్రతినిధి తెలిపారు. మొత్తం 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ అంతరిక్ష కేంద్రాన్ని బిజినెస్ పార్క్‌గా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. ఈ బిజినెస్ పార్క్‌లో కనీసం పది మందికి ఆస్ట్రోనాట్స్‌కు ఉండేలా స్పేస్ హోటల్, సినిమా షూటింగ్ కోసం స్టూడియో, పరిశోధనల కోసం రీసర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారట.
నాసాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తక్కువ కక్ష్యలో దీనిని ఏర్పాటుచేయనున్నట్టు కనిపిస్తోంది. కొత్తగా నిర్మించనున్న అంతరిక్ష కేంద్రం ఆర్బిటాల్ రీఫ్ కు 2025లో తొలి అంతరిక్షయానం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును చెప్పడానికి ఆయా సంస్థల ప్రతినిధులు ఇష్టపడటం లేదు. ప్రైవేటు స్పేస్ ఏజెన్సీలు, హైటెక్ సంస్థలు, స్పేస్ ప్రాజెక్టులు లేని దేశాలు, మీడియా, ట్రావెల్ సంస్థలు ఈ ప్రాజెక్టులో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది.