స్పోర్స్ట్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ సర్వత్రా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ లో వరుస ఓటములతో చతికిలపడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కి కొత్త ఓపెనర్ జేసన్ రాయ్ ఉత్సాహానిచ్చే విజయాన్ని సాధించాడు. దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో 42 బంతుల్లోనే 8×4, 1×6 సాయంతో 60 పరుగులు చేశాడు జేసన్ రాయ్.
జసన్ రాయ్ బ్యాటింగ్ ధాటికి క్రిస్ మోరీస్ ఒకే ఓవర్‌లో 18 పరుగులు ఇవ్వగా, స్పిన్నర్ రాహుల్ తెవాటియా ఏకంగా 21 పరుగులు సమర్పించాడు. ఈ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే 167/3 తో సునాయాసంగా హైదరాబాద్ ఛేదింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై ఈ మ్యాచ్‌లో వేటు పడగా, అతని స్థానంలో టీమ్ లోకి వచ్చిన జేసన్ రాయ్ నాలుగో ఓవర్ నుంచే చలరేగిపోయాడు.
నాలుగో ఓవర్ వేసిన ముస్తాఫిజుర్‌కి రెండు ఫోర్లు కొట్టిన జేసన్ రాయ్, ఆ తర్వాత ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన క్రిస్ మోరీస్‌కి 4, L4, 4, 4 రూపంలో వరుస బౌండరీలు కొట్టాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో రాహుల్ తెవాటియా బౌలింగ్ కి రావడంతో, అతనికీ ఒక సిక్స్, రెండు ఫోర్లని బాదేశాడు జేసన్ రాయ్. ఇంకేముంది ఆ ఒక్క ఓవర్‌లో 21 పరుగులు వచ్చి పడ్డాయి. మొత్తం మీద 11 ఓవర్లు ముగిసే సరికి 111/1 తో హైదరాబాద్ తిరుగులేని స్థితిలో నిలవగా, ఆ తర్వాత ఓవర్‌లో జేసన్ రాయ్ ఔటైపోయాడు.
ఐతే అప్పటికే మ్యాచ్ గెలుపు గమనంలోకి వచ్చేయడంతో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51 నాటౌట్: 41 బంతుల్లో 5×4, 1×6), అభిషేక్ శర్మ (21 నాటౌట్: 16 బంతుల్లో 1×4, 1×6) మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించారు. సన్ రైజర్స్ హైదరాబాద్‌కి ఐపీఎల్ 2021 సీజన్‌లో 10 మ్యాచ్‌లాడగా, ఇది రెండో గెలుపు. వరుసగా నాలుగు ఘోర పరాజయాల తర్వాత మళ్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది.