రాజస్థాన్- ప్రపంచంలో మోసాలు పెరిగిపోయాయి. ఎవరని ఎవరు నమ్మేటట్లు లేదు. ఎవరి చేతిలో ఎవరు ఎప్పుడు ఎలా మోసపోతారో ఎవరు ఉహించుకోలేకపోతున్నారు. ఇక ఈ మధ్య మన దేశంలో భార్య భర్తల మోసాలు బాగా పెరిగిపోయాయి. మొగుడు పెళ్లాలు ఇద్దరు కలిసి పక్కా ప్రణాళికతో లూటీలకు పాల్పడుతున్నారు. ఇక రాజస్థాన్ లో అయితే కట్టుకున్న భార్యనే చెల్లి అని చెప్పి మరొకరికి ఇచ్చి పెళ్లి చేశాడో మొగుడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది అక్షరాల జరిగింది. ఐతే అసలు కధ ఏంటంటే..
రాజస్థాన్ రాష్ట్రంలోని కోట జిల్లా కునాడి గ్రామానికి చెందిన రవి అనే యువకుడు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దేవ్ రాజ్ సుమన్ అనే ఓ మ్యారేజ్ బ్రోకర్‌ను సంప్రదించాడు. తన ఫొటోలను ఇచ్చి మంచి పెళ్లి సంబంధం చూసిపెట్టమని కోరాడు. దీంతో ఓ పెళ్లి సంబంధాన్ని రవికి చూశాడు మ్యారేజ్ బ్రోకర్ సుమన్. కోమల్ అనే యువతి పొటోను చూపించాడు. రవికి కోమల్ బాగా నచ్చింది. దీంతో ఆమెకు సంబందించిన పూర్తి వివరాలు అడిగితే, కోమల్ కు తల్లిదండ్రులు ఎవరూ లేరని, కేవలం ఒక అన్నయ్య మాత్రమే ఉన్నాడని చెప్పాడు. ఇంకేముంది కోమల్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు రవి.
ఈ క్రమంలో కోమల్ ను, ఆమె అన్నయ్యను ఓ హోటల్ లో కలిశాడు రవి. తాము కట్నం ఇచ్చుకోలేమని ముందుగానే కోమల్ అన్నయ్య సోను కార్పరే తేల్చి చెప్పాడు. తనకు కట్నం ఏమి అక్కర్లేదని రవి స్పష్టం చేశాడు. దీంతో రవి, కోమల్ పెళ్లి ఓ గుడిలో సన్నిహితుల మధ్య జరిగింది. ఇక వీరి పెళ్లయిన మూడో రోజే కోమల్ కనిపించకుండా పోయింది. అంతే కాదు ఆమెతో పాటు ఇంట్లో రెండు లక్షల రూపాయలు, బంగారు నగలు కూడా కనిపించలేదు. దీంతో కోమల్ ఇదంతా చేసిందని అనుమానించిన రవి, వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు విచారణ చేసే క్రమంలో మ్యారేజ్ బ్రోకర్ సుమన్‌ను ప్రశ్నించారు. ముందు తనకు ఏమీ తెలియదనీ, అందరిలాగే రవికి కూడా పెళ్లి సంబంధం కుదిర్చానని బుకాయించాడు.
ఐతే అతను చెప్పిన సమాధానంపై అనుమానం రావడంతో తమదైన శైలిలో పోలీసులు విచారించారు. దీంతో జరిగిన తతంగాన్ని సుమన్ చెప్పేశాడు. సోను కార్పరే, కోమల్ ఇద్దరు మొగుడు, పెళ్లాలని, గతంలో ఇండోర్‌లో నివసించే వారని చెప్పాడు. వారు డబ్బును ఈజీగా సంపాదించే మార్గాన్ని చెప్పారనీ, తనకు ఎక్కువ రిస్క్ లేకపోవడంతో ఇలా రవితో పెళ్లి నాటకం ఆడామని అసలు విషయం బయటపెట్టాడు. ఇంకేముంది సుమన్ చెప్పిన ఆధారాల ప్రకారం భార్యాభర్తలిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కలి కాలం అంటే ఇదే మరి.