ప్రతి ఒక్కరు ఉదయాన్నే కోడి కూతతోనే నిద్రలేస్తారు. కోడి గుడ్డును, మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇలా కోడి వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇదే సమయంలో కోడి కారణంగా ఇరుగు పొరుగువారి మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే కోడి వేధింస్తుంది అనే మాట మనం ఎక్కడ విని ఉండము. అయితే ఓ వృద్ధ దంపతులు.. తమని కోడి వేధిస్తోందని వాపోయారు. అంతే కాక దాని వేధింపులు తట్టుకోలేక న్యాయం కోసం కోర్టు మెట్లు సైతం ఎక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వృద్ధ దంపతుల పిటిషన్ కి కోర్టు ఏమని తీర్పు ఇస్తుందనే ఆసక్తిగా ప్రతిఒక్కరు ఎదురు చూస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ జర్మనీలోని బడ్ శాల్జూఫ్లెన్ ప్రాంతంలో ఫ్రెడ్రిక్ విల్హెల్మ్ కే, జుటా అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వారి ఇంటికి సమీపంలో మైఖేల్ డి (50) అనే వ్యక్తి కొన్ని కోళ్లను పెంచుకుంటున్నాడు. వీడిలో మడ్గా అనే కోడి పుంజు కూడా ఉంది. అయితే ఈ కోడిపుంజు మొదట్లో బాగానే ఉన్నా.. కొన్నాళ్లకి తెల్లవారింది మొదలు సాయంత్ర వరకు కూతలు పెడుతూనే ఉంది. దీంతో చుట్టుపక్కల వారు చాలా ఇబ్బందికి గురయ్యారు. వారందరూ మైఖేల్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ కోడిపుంజూ చేసే శబ్దాలకు నిద్రరావడం పట్టడంలేదని, చెవులు పగిలిపోతున్నాయని తెలిపారు. అయితే కోడిపుంజు లేకుంటే కోళ్లు.. ఒకదానినొక్కటి పొడుచుకుని చంపుకుంటాయని అతడు నిర్లక్ష్య సమాధానం ఇచ్చాడు.
ఈ క్రమంలో స్థానికులు కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. వేరే చోటుకు వెళ్లాలేని ఆ వృద్ధ దంపతులు మైఖేల్ ని మరోసారి బ్రతిమిలాడారు. అయిన అతడు పట్టించుకోలేదు. దీంతో వారు స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. కోడి పుంజు వేధింపుల నుంచి తమను రక్షించాలని ఫిర్యాదు చేశారు. ఆ కోడిపుంజు వల్ల మనశ్శాంతి కరువయ్యిందని, అరుపులు భరించలేక ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోయినవారి వివరాలను కోర్టుకు అందజేశారు. పొద్దున్న అనగా మొదలుపెట్టి.. రాత్రి నిద్రపోయే వరకూ కూస్తునే ఉంటోందని.. దాని కూతను రికార్డ్ చేసి మరీ కోర్టుకు సమర్పించారు ఆ వృద్ధ దంపతలు.
ఇంటి తలుపులు తెరచి కాసేపు ప్రశాంతంగా కూర్చొందామన్న కోడి కూతకు భయపడి బయటకు రాలేకపోతున్నామని తెలిపారు. తలుపులు కాదు కదా కనీసం కిటికీలు కూడా తెరవడానికి భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోర్టు ఇచ్చే తీర్పు కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.