కాలం మారుతున్నా కొద్ది మనుషుల్లో మానవత్వం పూర్తిగా అడుగంటి పోతోంది.. డబ్బు కోసం ఈ కాలంలో మనిషి దేనికైనా సిద్దపడుతున్నాడు.
ధనమే పెరిగి.. మమతే తరిగి మనిషే ఈనాడూ దానవుడైనాడు.. అంటూ ఓ సినిమాలో పాట. ఆ కాలంలో మానవ నైజం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు కవి. నేటి సమాజంలో మానవత్వం పూర్తిగా నశించిపోతుందని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. ప్రేమానురాగాలు, వాత్సల్యం, ఆప్యాయతలు అంతరించిపోతున్నాయి. ఇప్పడు ప్రతి ఒక్కటి ఆర్థిక సంబంధాలైపోతున్నాయి. ఆస్తి కోసం సోంతవాళ్లనే చంపుకుంటున్న దారుణమైన సంఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఫీటున్నర స్థలం కోసం కొడుకు కోడలు పెట్టి టార్చర్ తట్టుకోలేక వృద్దదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కనికపు దేవయ్య, లక్ష్మీ నర్సవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇటీవల కొడుకులకు ఆస్తి పంపకాలు జరిపారు. దేవయ్య పాత ఇంటి వెనుక పెద్ద కొడుకు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అయితే పెద్ద కొడుకుకు ఫీటున్నర స్థలం ఇవ్వాల్సి ఉంది. తనకు ఆ స్థలం కావాలని.. అందుకోసం ఇల్లు కూల్చివేసి తల్లిదండ్రులను పదే పదే అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే శనివారం తల్లిదండ్రులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు పెద్దకొడుకు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఇంట్లో ఉన్న మల్లన్న దేవుడిని తీసుకు వెళ్తా అని.. మర్యాదగా ఇల్లు కూల్చివేయాలని తల్లిదండ్రులను గట్టిగా మందలించి వెళ్లాడు.
ఇక కొడుకు పెట్టే వేధింపులు తట్టుకోలేక పోయాని దేవయ్య, లక్ష్మీ నర్సవ్వ జీవితంపై విరక్తి చెంది చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వృద్ద దంపతులు శనివారం రాత్రి ఇంట్లో తలుపులు వేసుకొని పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పపడ్డారు. ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు ఇంట్లోకి దిగి చూశారు. ఇంట్లో దంపతులు విగతజీవులుగా పడి ఉన్నారు. ఒకే చితిపై దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు. చిన్న కుమారుడు మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అందరితో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ కలుపుగోలుగా ఉండే దేవయ్య, లక్ష్మీ నర్సవ్వ దంపతులు కన్నుమూయడంతో గ్రామంలో విషాదం నెలకొంది.