ఇంటి పని చేసినందుకు రూ. 1.75 కోట్లు. అంతేనా నెల నెలా ఆమెకు 43 వేలు, ఆమె ఇద్దరు పిల్లలకు 86 వేలు. మొత్తం మీద నెలకు రూ. లక్షా 30 వేలు ఇవ్వాలి. అంత కాస్ట్లీ పని మనిషా అని అనుకుంటున్నారా? నిజమే ఒకటి, రెండు కాదు ఏకంగా 25 ఏళ్ళు పని చేసింది. పెళ్లి చేసుకుని ఒక మనిషికి, ఆ మనిషి ఇంటికి జీతం లేని పని మనిషి అయ్యింది. ఇన్నాళ్లకు ఆమె కష్టాన్ని గుర్తించి ఆమెకు 25 ఏళ్ళు చేసిన చాకిరీకి వేతనం ఇవ్వాలని, నెలకి మెయింటెనెన్స్ కింద లక్షా 30 వేలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
వైవాహిక జీవితాలు దారంలా పుటుక్కున తెగిపోతున్నాయి. మనస్పర్థల కారణంగా జంటలు విడాకులు ఇచ్చేసుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ పోకడ మరీ ఎక్కువ. భర్తకు అంటే ఉద్యోగం ఉంటుంది కాబట్టి విడిపోయినా పెద్ద ప్రభావం ఉండదు. కానీ ఆడవారికే ఇబ్బంది. అప్పటివరకూ భర్తకు వండి పెట్టి, బట్టలుతికి, సామాన్లు తోమి.. ఇంటి పని, ఆ పని అంటూ బోలెడంత చాకిరీ చేసిన మహిళ పరిస్థితి ఏంటి? ఇక పిల్లలు ఉంటే జీవితం ఇంకా భయంకరంగా ఉంటుంది. అందుకే భార్యకు విడాకులు ఇచ్చే భర్తలు భరణం చెల్లించాలని, పరిహారం చెల్లించాలని కోర్టులు తీర్పునిస్తున్నాయి. తాజాగా ఓ మహిళ విషయంలో స్పెయిన్ కోర్టు మనసుతో ఆలోచించి తీర్పు ఇచ్చింది. గృహ కార్మికురాలిగా 25 ఏళ్ళు పని చేసినందుకు ఆమెకు 1,80,000 యూరోలు చెల్లించాలని స్పెయిన్ కోర్టు నిర్ణయించింది. మన కరెన్సీ ప్రకారం 1.75 కోట్లు పైనే.
అంతేకాదు నెల నెల మెయింటెనెన్స్ కింద అదనంగా కొంత సొమ్ము చెల్లించాలని ఆదేశించింది. ఆమెకు, ఆమె ఇద్దరి కూతుర్లకు ఈ సొమ్ము చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తన మాజీ భార్యకు 1,80,000 యూరోలు లేదా రూ. 1.75 కోట్లు చెల్లించాలని స్పెయిన్ కోర్టు తీర్పు ఇచ్చింది. 25 ఏళ్ల పాటు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇంటి పని చేసినందుకు వేతనం కింద ఈ డబ్బు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 25 ఏళ్ల పాటు ఆమె వేతనం లేని గృహ కార్మికురాలిగా ఉంది కాబట్టి నష్టపరిహారంగా డబ్బు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. స్పెయిన్ కి చెందిన ఇవానా మోరల్ అనే మహిళకు తన భర్త 2020లో విడాకులు ఇచ్చాడు. ఈమెకు 20 ఏళ్ళు, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే భర్త ఆమెను వదిలేయడంతో ఆమె న్యాయం కోసం కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు న్యాయమూర్తి లారా రూయిజ్ అలమినోస్.. ఇవానా మోరల్ కి న్యాయం జరిగేలా తీర్పు ఇచ్చారు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో జీతం అనే మాట లేకుండా గొడ్డులా కష్టపడి చాకిరీ చేసినందుకు గాను పరిహారం చెల్లించాలని ఆమె మాజీ భర్తకు కోర్టు సూచించించి.
నెల మెయింటెనెన్స్ కింద మాజీ భార్యకు 527 డాలర్లు, అలానే ఒక కూతురికి 422 డాలర్లు, మరొక కూతురికి 633 డాలర్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఆమె మాజీ భర్తకు ఒక జిమ్ బిజినెస్ ఉంది. అలానే 6.4 మిలియన్ డాలర్ల విలువ చేసే విలాసవంతమైన ఆస్తులు కూడా ఉన్నాయని కోర్టులో తేలింది. ఈ ఆస్తులు, అతని వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం ప్రకారం లెక్కగట్టి మాజీ భార్యకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఎంతోమంది విడాకులు పొందిన మహిళలకు ఉదాహరణగా, ఆదర్శంగా నిలుస్తుందని, భర్త వదిలేస్తే ఇన్నాళ్లు చేసిన ఇంటి పనికి వేతనం పొందే అవకాశం వస్తుందని ఇవానా మోరల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరి గృహ కార్మికురాలిగా జీతం ఇవ్వకుండా పని చేయించుకుని విడాకులు ఇచ్చేసిన మాజీ భర్తకు కోర్టు పరిహారం ఇవ్వాలని తీర్పు ఇవ్వడమే గాక నెల నెలా మెయింటెనెన్స్ కింద కొంత సొమ్ము చెల్లించాలని ఆదేశించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.