ఒకడు వెయ్యికి పైగా కుక్కలను తిండి పెట్టకుండా నరకం చూపించి చంపాడు. అయితే జంతు ప్రేమికులు ఆ వ్యక్తి మీద కేసు వేశారు.
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కుక్కలా బెడద ఎక్కువైపోయింది. పిచ్చి పట్టినట్టు కుక్కలు కనిపించిన మనుషుల మీద పడి దాడి చేస్తున్నాయి. ఎదిరించలేని పిల్లల్ని అయితే చంపేస్తున్నాయి లేదా చంపేసే స్థాయిలో దాడి చేస్తున్నాయి. దీంతో కుక్కలని చంపేయాలి అని కొంతమంది పట్టుబడుతున్నారు. అయితే జంతు ప్రేమికులు మాత్రం వాటిని సంరక్షించాలని, ఏలకు ఫుడ్డు, బెడ్డు సమకూర్చిపెట్టాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులున్న సమాజంలో ఒక వ్యక్తి వెయ్యి కుక్కలను ఆకలితో చచ్చేలా చేశాడు. ఎవడ్రా బాబు కనబడితే ఫోటో తీసి ఇంట్లో పెట్టుకుని రోజూ పూజ చేస్తాం అని అనాలనిపిస్తుందా? కానీ మీరు పూజ చేయాలని అనుకున్నా కొంతమంది జంతు ప్రేమికుల మూలంగా అతను జైలు శిక్ష అనుభవించడం లేదా రూ. 2 లక్షల జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక వ్యక్తి వెయ్యి కుక్కలకు ఆహారం పెట్టకుండా ఆకలితో అలమటించి చనిపోయేలా చేశాడు. ఈ ఘటన దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది. గ్యాంగి ప్రావిన్స్ లోని యంగ్ ప్యోంగ్ కి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి కొంతమంది కుక్కల యజమానులు తమ కుక్కలని చూసుకోమని కొంత డబ్బు ఇచ్చి అతని వద్ద వదిలిపెట్టి వెళ్లారు. బాగా చూసుకోవడం కోసం ఒక్కో కుక్కకు దక్షిణ కొరియా కరెన్సీ ప్రకారం 10 వేల వన్ లు ఇచ్చేవారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 621 రూపాయలు. 2020 నుంచి ఇస్తున్నారు. అయితే ఈ పెద్ద మనిషి కుక్కలకు ఆహారం పెట్టకుండా ఆకలితో చనిపోయేలా చేశాడు. తమ కుక్క కనబడడం లేదని ఒక యజమాని వెతుక్కుంటూ వెళ్లగా ఓ ఇంట్లో కుక్కలు చనిపోయి ఉండడం చూసి అధికారులకు సమాచారం ఇచ్చాడు.
అది కాస్తా జంతు ప్రేమికుల దృష్టిలో పడడంతో నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు పెద్దాయనను అరెస్ట్ చేశారు. యజమానులు వదిలేసిన, జీవితకాలం పూర్తయిన కుక్కలను సేకరించి వాటి కడుపు మాడ్చి చనిపోయేలా చేసింది తానే అని ఆ ముసలాయన ఒప్పుకున్నాడు. జంతు హక్కులను ఉల్లఘించినందుకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. స్థానిక చట్టాల ప్రకారం మూడేళ్ళ జైలు శిక్ష లేదా రూ. 2 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు. మరి వెయ్యి కుక్కలను తిండి పెట్టకుండా చంపడంపై మీ అభిప్రాయమేమిటి? మన దేశంలో మనుషుల్ని కరిచే కుక్కలనే ఏమీ చేయకూడదు అని అంటున్నారు. మరి ఈ పెద్దాయన మన దేశంలో కుక్కల్ని ఇలా చేసి ఉంటే జంతు ప్రేమికులు ఏం చేసేవారు? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.