స్టాక్ మార్కెట్ అంటేనే మాయాజాలం.. ఎప్పుడు కుభేరున్ని చేస్తుందో.. ఎప్పుడు బికారీగా మారుస్తుందో చెప్పడం కష్టం. ఇక్కడ ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవడం’ సర్వసాధారణం. ఒకప్పుడు మార్కెట్‌ని ఏలిన దిగ్గజ కంపెనీ ధరలు ఒక్కసారిగా ఢమాల్ అన్నాయి. రెండేళ్ల తర్వాత ఓ దిగ్గజ కంపెనీ స్టాక్ ధరలు ఒక్కసారే పడిపోవడంతో భారీ నష్టం ఏర్పడింది. ఆ ప్రభావం ఓ బిలియనీర్ మీద పడటంతో రూ.70 వేల కోట్లకు పైనే నష్టపోయారు. వివరాల్లోకి వెళితే.. సింగపూర్ గేమింగ్ బిలియనీర్ ఫారెస్ట్ లీ(44)కి భారీ షాక్ తగిలింది. చైనా గేమింగ్ దిగ్గజం టెన్సెంట్, సీ లిమిటెడ్ కంపెనీ వాటాలో కోత విధించడంతో.. ఫారెస్ట్ లీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ నష్టం విలువ 10 బిలియన్ డాలర్లకు పైమాటేనని బ్లూమరాంగ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అంటే మన కరెన్సీలో 70 వేల కోట్ల రూపాయలకు పైమాటే.
ప్రస్తుతం ఫారెస్ట్ లీ సంపద 11.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో సింగపూర్ రిచ్ పర్సన్ జాబితాలో మూడు ప్లేస్‌కు చేరుకున్నాడు. వాస్తవానికి ఫారెస్ట్ లీకి గత ఏడాది నుంచి బ్యాడ్ టైమ్ నడుస్తుందని అంటున్నారు. ఫారెస్ట్ లీ చైర్మన్‌గా 2009లో సీ లిమిటెడ్ ప్రారంభమైంది. ఆయనతో పాటు గ్యాంగ్ యే, డేవిడ్ చెన్ అనే ఇద్దరు కూడా ఈ కంపెనీలో భాగస్వామ్యమయ్యారు. షాపీ అనే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్, మొబైల్ గేమ్ ఫైర్ ఫ్రీని ఇది అందిస్తోంది. గూగుల్ ప్లేలో వంద కోట్ల డౌన్లోడ్లు దాటిన గేమ్ ఇదే కావడం గమనార్హం. అయితే సీ లిమిటెడ్ పేరుకు సింగపూర్ కంపెనీ అయినప్పటికీ.. ట్రేడ్ మాత్రం అమెరికా ఆధారితంగానే నడుస్తోంది. ఈ కంపెనీ ద్వారా యే, చెన్లకు 6.3 బిలియన్ డాలర్లు, 2.1 బిలియన్ డాలర్ల ఆదాయం ఇప్పటిదాకా సమకూరింది. ఆ ఎఫెక్ట్‌తో ఫారెస్ట్ లీ ఏకంగా సింగపూర్ రిచ్చెస్ట్ పర్సన్‌గా అవతరించాడు.
ఇది చదవండి : నడ్డాకు కేరాఫ్ అడ్డ ఎర్రగడ్డ.. మంత్రి కేటీఆర్ ఫైర్!
అంతా బాగుందీ అనుకుంటున్న సమయంలోనే ఫారెస్ట్ లీకి బ్యాడ్ టైమ్ మొదలైంది. గత అక్టోబర్‌లో అమెరికన్ డిపాజిటరీ రసీదులు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుంచి తన సంపదను క్రమంగా కోల్పోతూ వస్తున్నారు. సీ కంపెనీ వాటాను 21 శాతం నుంచి 18 శాతానికి కోత విధించినట్లు టెన్సెంట్ కంపెనీ ప్రకటించింది. తీవ్రమైన పోటీ నేపథ్యం, స్టాక్ మార్కెట్ కుదేలు, ఇతర పరిణామాలతో ఆయన సంపద కరిగిపోతూ వస్తోంది. గేమింగ్-ఈకామర్స్ దిగ్గజం అయిన టెన్సెంట్ స్టాక్ ధరలు రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో పతనం కావడమే ఇందుకు కారణం. ఈ చర్యతో సీ కంపెనీ వోటింగ్ హక్కులు సైతం 10 శాతానికి పడిపోయింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలిజేయండి.