ఒకప్పుడు మనిషి జీవితంలో.. బాధ్యతలతో పాటు బంధాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడవన్ని టెక్నాలజీకే పరిమితం అయ్యాయి. కాలంతో పాటు పరుగు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒక్క క్షణం ఆగినా.. ఎక్కడ వెనకబడిపోతామో అనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంది. అందుకే బంధాలకు కూడా సమయం కేటాయించలేనంత బిజీగా మారిపోయాం. మన ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకునే తీరిక లేనప్పుడు ఇక పక్క ఇంటి గురించి ఏం ఆలోచిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా ఇలానే ఉన్నాయి పరిస్థితులు.
ఈ క్రమంలో లండన్ లో ఓ హృదయవిదారక సన్నివేశం వెలుగు చూసింది. ఓ వృద్ధురాలు రెండేళ్లుగా కనిపించడం లేదు. దీని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆమె ఇంటి నుంచి భరించలేని దుర్వాసన రాసాగింది. దీని గురించి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో.. ఇంటి తలుపులు తెరవగానే వారికి కనిపించిన దృశ్యం చూసి భయంతో బిగుసుకుపోయారు. వారిని అంతలా భయపెట్టిన ఆ సంఘటన వివరాలు..
లండన్‌లోని పెచ్‌కమ్‌లోని సెయింట్ మేరీస్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్థుల భవనంలో 60 ఏళ్ల పైబడిన ఓ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. గత రెండేళ్లుగా ఆమె ఉంటున్న పోర్షన్ తలుపు మూసే ఉంది. పైగా ఆమె ఇంటి డోర్‌కి అడ్డంగా ఓ సైకిల్ పెట్టి ఉంది. దీంతో ఆమె ఇంట్లో లేదని అంతా అనుకున్నారు. అదే టైంలో దాదాపు రెండేళ్లుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తూనే ఉంది. ఈ విషయాన్ని హౌజింగ్ అసోషియేషన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయింది. చేసేదేం లేక ఆ సోసైటీ ప్రజలు ముక్కు మూసుకుని అడ్జస్ట్ అవుతూ వస్తున్నారు.
అయితే ఆ వాసన భరించలేక పోయిన ఓ యువతి.. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫిబ్రవరి 18వ తేదీన బలవంతంగా పోలీసులు డోర్లు బద్ధలు కొట్టి చూశారు. కుర్చీలో ఆ పెద్దావిడ అస్థిపంజరం కూర్చున్న పొజిషన్లో కనిపించడంతో అంతా షాక్ తిన్నారు. అంటే ఆ మహిళ.. కుర్చీలో కూర్చుని.. అలానే మృతి చెందింది. ఈ విషయం ఎవరికి తెలియలేదు. పైగా రెండేళ్లుగా శవం అక్కడే అదే పొజిషన్ లో కుళ్లిపోయి.. అస్థిపంజరంగా మారింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. అసలు సదరు మహిళ ఎవరు.. ఆమె స్వస్థలం ఎక్కడ.. ఆమెకు సంబంధించిన వారి గురించి ఎలాంటి సమాచారం సదరు హౌజింగ్ సోసైటీ వారికి తెలియకపోవడం.
ఆమె ఇంటి బయట కుప్పలుగా లెటర్లు, ఇంటి అద్దె బాకీ ఉన్నట్లు నోటీసులు పేరుకుపోయి ఉన్నాయి. చివరికి గ్యాస్ చెకింగ్‌కు వచ్చిన వాళ్లు సైతం డోర్‌కు నోటీసులు అంటించడంతో ఆమె జాడ గురించి చుట్టుపక్కల వాళ్లలో అనుమానాలు మొదలయ్యాయి. హౌజింగ్ అసోషియేషన్ ఎంతకీ విషయం పట్టించుకోకపోవడం.. ఓ యువతి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరం స్థితిలో ఆ పెద్దావిడ కనిపించింది. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఎవరు.. ఏం జరిగి ఉంటుందనే విషయాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన లండన్‌లో హాట్ టాపిక్‌గా మారింది ఇప్పుడు. ఇదిలా ఉండగా.. ఇటలీలోనూ ఈ మధ్య ఇలాంటి ఘటనే ఒకటి జరగడం విశేషం. ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.