ఒక అవమానం ఖరీదు 6 రోల్స్ రాయిస్ కార్లు. ఒక ఇంగ్లీషోడు అవమానించాడని వారం రోజులు వరుసగా వివిధ రంగులతో కూడిన రోల్స్ రాయిస్ కార్లను కొనేసాడు భారత సంతతికి చెందిన వ్యక్తి.
భారతీయులకు సహనం, పట్టుదలే కాదు ఆత్మాభిమానం కూడా ఎక్కువే. ఎవరైనా ఆత్మాభిమానాన్ని తక్కువ చేస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతవరకైనా వెళ్తారు. అనాది నుంచి విదేశీయులకు భారతీయులంటే చులకన. భారతీయుల వస్త్రధారణ అన్నా, భారతీయులన్నా ఎందుకో చిన్న చూపు చూస్తారు. ఇప్పటికీ కొంతమంది విదేశీయులు తమ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే మనోళ్లు ఏమైనా తక్కువ తిన్నారా? ఎప్పటికప్పుడు వాళ్లకి ధమ్కీ ఇచ్చేస్తున్నారు. అలాంటి వారిలో భారత సంతతికి చెందిన రూబెన్ సింగ్ ఒకరు. అదే పనిగా తన తలపాగాను చూసి వెక్కిరిస్తున్నాడని దిమ్మ తిరిగేలా జవాబిచ్చాడు.
తలపాగా పవర్ ఏంటో చూపించాడు. తలపాగా కట్టుకున్న వ్యక్తి శక్తి ఎలా ఉంటుందో చూపించాడు. లండన్ లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త రూబెన్ సింగ్. 1990లో ‘మిస్ ఆటిట్యూడ్’ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ ని స్థాపించి కోట్లు గడించాడు. 17వ ఏట నుంచే రోజులో 20 గంటలు కష్టపడుతూ అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అయితే కొన్ని రోజులు వ్యాపారం దెబ్బ తిన్నది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా వ్యాపార సామ్రాజ్యాన్ని టాప్ పొజిషన్ లో నిలబెట్టాడు. బ్రిటన్ బిల్ గేట్స్ గా ఫేమస్ అయ్యాడు. సిక్కు మతానికి చెందిన వ్యక్తి కావడంతో తలపాగా చుట్టుకోవడం సంప్రదాయం. అయితే ఇంగ్లాండ్ కి చెందిన ఒక వ్యక్తి తలపాగా చూసి జాత్యాహంకారంతో కామెంట్స్ చేశాడు. ‘నువ్వు ధరించిన తలపాగా రంగు ఎక్కడా ఉండదు’ అంటూ అహంకారంగా మాట్లాడాడు.
అంతే రూబెన్ సింగ్ కి చిర్రెత్తుకొచ్చింది. నా తలపాగాకే పేరు పెడతావా అంటూ.. ‘నా తలపాగా రంగుకి మ్యాచ్ అయ్యే కార్లు కొంటాను. ఒకటి కాదు, రెండు కాదు 6 కార్లు కొంటాను. ఒకే రంగు కాదు, రోజుకో రంగు కారు కొంటాను. తలపాగా రంగుకు తగ్గట్టు కొంటాను. అది కూడా అల్లాటప్పా కారు కాదు, మీ ఇంగ్లాండ్ వాళ్ళు చేసిన రోల్స్ రాయిస్ కార్లనే కొంటాను’ అంటూ శపథం చేశాడు. ఈ ఛాలెంజ్ లో ఓడిపోయిన వారు స్వచ్చంద సంస్థకు విరాళంగా డబ్బు ఇవ్వాలని పందెం వేసుకున్నారు. ఇక పందానికి సిద్ధమయ్యాడు మన గబ్బర్ సింగ్. తన తలపాగా రంగుకి మ్యాచ్ అయ్యే రోల్స్ రాయిస్ కార్లను కొనేసాడు. 6 రోజుల పాటు తాను ధరించే తలపాగా రంగుకి తగ్గా రోల్స్ రాయిస్ కార్లను కొనేసాడు. అతను ధరించే తలపాగా రంగుకి తగ్గట్టు రోల్స్ రాయిస్ కారుని కొనడం, దానితో ఫోటో దిగడం ఇలా 6 రోజులు చేశాడు.
వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. అసలు రోల్స్ రాయిస్ కార్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. అలాంటిది తలపాగాను అవమానించాడని దాని విలువ ఏంటో తెలియజేయడం కోసం, సింగ్ రేంజ్ తెలియజేయడం కోసం, భారతీయుడి ఆత్మాభిమానం పొగరుని చూపించడం కోసం ఈ ఛాలెంజ్ ని స్వీకరించాడు సింగ్. ప్రస్తుతం సింగ్ దగ్గర 15 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు లాంబోర్గినీ హురాకాన్, బుగాటి వెయ్రోన్ , ఫెర్రారీ ఎఫ్ 12 బెర్లినిట్ట, పోర్షే 918 స్పైడర్, పగాని హైరా 5 లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.కాషాయం, ఎరుపు, పచ్చ, ముదురు ఎరుపు, నీలం రంగులతో కూడిన కార్లు ఇవి. వీటిని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కలెక్షన్ గా పిలుచుకుంటాడు. ఈ రంగులతోనే తన తలపాగాలు ఉండడం విశేషం.
ఆ రకంగా తలపాగాకు మ్యాచ్ అయ్యే రోల్స్ రాయిస్ కార్లను సొంతం చేసుకుని సింగ్ పవర్ ఏంటో చూపించాడు. 1920ల కాలంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఆళ్వార్ మహారాజు జై సింగ్ ప్రభాకర్ అవమానానికి గురైతే 7 రోల్స్ రాయిస్ కార్లను చెత్త ఊడ్చే వాహనాలుగా వాడాడు. ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు క్యాజువల్ డ్రెస్ లో కారు కొందామని రోల్స్ రాయిస్ షోరూంలోకి వెళ్తే టెస్ట్ డ్రైవ్ కి కారు ఇవ్వలేదు. కోపమొచ్చి ఇండియా వెళ్ళాక 7 కార్లను ఆర్డర్ ఇచ్చి వాటిని చెత్త ఊడ్చే వాహనాలుగా మార్చాడు. దెబ్బకు రోల్స్ రాయిస్ కంపెనీ దిగొచ్చి క్షమాపణలు చెబుతూ లేఖ రాసింది. భారతీయుల దెబ్బ ఇలానే ఉంటుంది. లేకపోతే కుక్కలకు, భారతీయులకు ప్రవేశం లేదు అని బోర్డులు పెడతారా? ఇలానే ఉంటుంది భారతీయుడి ఆత్మాభిమానం యొక్క పొగరు. మరి రాజు స్థానంలో గానీ సింగ్ స్థానంలో గానీ మీరు ఉంటే ఏం చేసేవారో కామెంట్ చేయండి.