ఈరోజుల్లో ఒక రూపాయిని ఇతరులకు దానం చేయాలంటే వంద సార్లు ఆలోచిస్తారు. అలాంటిది కోట్ల రూపాయల సొమ్ముని దానం చేయాలంటే ఆలోచించకుండా ఉంటారా? ఎందుకు దానం చేయాలి? అని భావిస్తారు. కొంతమంది ఏ టీవీ షోలో పాల్గొని గెలవగా వచ్చిన ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్న వారి కోసం ఖర్చు పెడతామని అంటారు. కొంతమంది లాటరీలో గెలుచుకున్న సొమ్ముని ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం ఖర్చు చేయాలనుకుంటారు. సాధారణంగా లాటరీలో గెలుచుకున్న సొమ్ముని ఇతరులకి ఇవ్వడానికి ఇష్టపడరు. చాలా వరకూ స్వార్థంగానే ఉంటారు. కానీ సజేష్ ఎన్ఎస్ (47) అనే వ్యక్తి మాత్రం తాను గెలుచుకున్న లాటరీ డబ్బులో తనతో పాటు కలిసి పని చేసే ఉద్యోగులకి సహాయం చేస్తానని వెల్లడించాడు.
వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్ లో భారతీయుడికి చెందిన ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ లో సజేష్ ఎన్ఎస్ అనే వ్యక్తి పర్చేసింగ్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. 20 మంది తోటి ఉద్యోగులతో కలిసి ఆన్ లైన్ లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అయితే అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 25 మిలియన్ దిర్హామ్స్ అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు 55 కోట్లు పైనే గెలుచుకున్నాడు. 20 మందికి ఎంత వాటా ఇవ్వాలో ఆ షేర్ ఇచ్చేశాడు. తన వాటా సొమ్ముని మాత్రం తనతో పని చేసే వర్కర్స్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తనతో పాటు ఆ హోటల్ లో దాదాపు 150 మంది పని చేస్తున్నారని, లాటరీ సొమ్ముతో తనకు సాధ్యమైనంత వరకూ సహాయం చేస్తానని వెల్లడించాడు. ఇతను తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.