జీవితం ఉన్నతంగా ఉండాలని.. ఉన్నత చదువులు చదివి.. విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది. అలా వెళ్లిన వారు అక్కడ చాలా ఇబ్బందులను ఎదుర్కొటారు. అందులో జాతివివక్ష ముఖ్యమైంది. ఈ వివక్ష కారణంగా గతంలో చాలా మందిని కాల్చి చంపడమే కాకుండా కిడ్నాప్ కూడా చేసిన సంఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా సోమవారం ఓ కుటుంబం కిడ్నాప్ కు గురైన మరో సంఘటన కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించింది. కిడ్నాప్ కు గురైన వారిలో 8 నెలల పసికందు ఉండటం బాధాకరమైన విషయం. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ ప్రాంతలో భారతీయ సంతతికి చెందిన జస్ దీప్ సింగ్(36) అతడి భార్య జస్లీస్ కౌర్(27) నివాసం ఉండేవారు. వీరికి అరూహి ధేరిని అనే 8 నెలల పాప కూడా ఉంది. వీరు సరకులు కొనడానికి మార్కెట్ కు వెళ్లారు. అక్కడి నుంచి వీరిని నలుగురు దుండగులు వచ్చి కిడ్నాప్ చేశారని స్థానిక పోలీసులు తెలిపారు. వీరితో పాటుగా అమన్ దీప్ సింగ్(39) అనే వ్యక్తిని కూడా కిడ్నాప్ చేశారు. వారందరిని బ్లాక్ నంబర్ 800 సౌత్ హైవే 59, దగ్గర కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు కిడ్నాపర్స్ నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని పోలీసులు తెలిపారు. స్థానికంగా మీకు అనుమానంగా ఎవరైన కనిపిస్తే.. 911 కి ఫోన్ చేయాలని వారు సూచించారు.
అయితే అమెరికాలో ఇలా భారత సంతతి వారు కిడ్నాప్ అవ్వడం ఇదే తొలి సారి కాదు. గతంలో కొన్నిసార్లు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. అమెరికాలో జాతివివక్ష హత్యలు, కిడ్నాప్ లు జరుగుతూనే ఉంటాయి. తాజాగా జరిగిన అపహరణ గురించి ఎటువంటి సమాచారం అయితే ఇంతవరకు పోలీసులకు లభించలేదు. వారు డబ్బుల కోసం అపహరించారా? లేక ఇంకేదయిన కారణాలు ఉన్నాయా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. అయితే కిడ్నాపర్ల చర నుంచి వారు క్షేమంగా బయటపడాలని భారతీయులందరు ఆకాంక్షిస్తున్నారు. ఇక ఈ సంఘటనపై కాలిఫోర్నియా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.