ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. టీజర్ రిలీజ్ కావడం ఏమో గానీ.. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ కూడా చిత్రబృందంపై విమర్శలు చేస్తున్నారు. గ్రాఫిక్స్ బాగోలేదని, బొమ్మల సినిమాలా ఉందని, రావణాసురుడిగా గెటప్ అలా ఉండటం ఏంటని.. ఇలా రకరకాల కారణాలు చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడిదంతా కాదన్నట్లు మరో కొత్త కారణం తెరపైకి వచ్చింది. ఏకంగా ఓ రాష్ట్ర హోం మంత్రి రంగంలోకి దిగారు. డైరెక్టర్ ఓం రౌత్ కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ హీరోగా రామాయణం బ్యాక్ డ్రాప్ తో తీసిన సినిమా ‘ఆదిపురుష్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. అయోధ్య సరయూ నది ఒడ్డున అక్టోబరు 2న జరిగిన వేడుకలో టీజర్ ని లాంచ్ చేశారు. అప్పటినుంచి ఈ సినిమా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంది. గ్రాఫిక్స్, సైఫ్ చేసిన రావణాసురుడి గెటప్, వానరాలు బదులు గొరిల్లాలు ఉండటం.. ఇలా పలు విషయాల్లో నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కాదన్నట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కొత్త వాదనని తెరపైకి తీసుకొచ్చారు.
తాజాగా మీడియా ముందుకు వచ్చిన నరోత్తమ్ మిశ్రా.. ‘ఆదిపురుష్ టీజర్ చూశాను. అయితే అందులో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి. హిందూ విశ్వాసానికి సంబంధించిన కొన్ని సీన్స్ చూపించిన విధానం సరిగా లేదు. టీజర్ లో హనుమంతుడు ధరించిన అంగవస్త్రం లెదర్ తో తయారు చేసినట్లు చూపించారు. హనుమాన్ చాలీసాలో ఆయన ఎలా ఉన్నారనేది క్లియర్ గా వర్ణించారు. ఇందులో దర్శకుడు మాత్రం వేరేలా చూపించారు. ప్రతిసారీ మా దేవుడిని ఎందుకు ఇలా కించపరుస్తున్నారు(సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి). వేరొకరి దేవుడిపై ఎందుకు ఇలాంటివి చేయరు? అలా చేసే దమ్ము ఉందా?’ అని అన్నారు.
ఆదిపురుష్ టీజర్ లోని ఈ సీన్స్ తొలగించాలని చిత్ర దర్శకనిర్మాత ఓం రౌత్ కి లేఖ రాస్తున్నానని నరోత్తమ్ మిశ్రా చెప్పారు. వారు గానీ ఆ సీన్లను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడి వేషధారణపైనా నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ హెయిర్ కట్ తోపాటు నుదుట నామాలు లేకపోవడం ఏంటని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ‘ఆదిపురుష్’ టీజర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.