‘ఆదిపురుష్’ టీజర్, అందులోని క్యారెక్టర్స్ పై విపరీత స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. రామయాణాన్ని వక్రీకరించి తీశారని, మూవీ టీమ్ పై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇదంతా పక్కనబెడితే టీజర్ లోని ఓ విషయం పలువురు ఫ్యాన్స్ ని ఆకర్షించింది. అదే ‘ఆదిపురుష్’లో హనుమంతుడి పాత్రధారి ఎవరా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. దానికి తోడు మూవీలే అతడే కీలకం అని కూడా అనిపిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా చాలామంది ఎదురుచూసిన ‘ఆదిపురుష్’ టీజర్ తాజాగా విడుదలైంది. అయోధ్యలో సరయూ నదీ తీరాన గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి, టీజర్ ని లాంచ్ చేశారు.
ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ నటించారు. వీళ్ల గురించి ప్రేక్షకులకు దాదాపు తెలుసు. కానీ హనుమంతుడి పాత్రధారి గురించి ఎవ్వరికీ తెలీదు. దీంతో అతడు ఎవరా అని సెర్చ్ చేశారు. ఈ క్రమంలో అతడి గురించి ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. హనుమంతుడిగా నటించిన అతడి పేరు దేవదత్త గజానన్ నాగే. ఇతడు మరాఠీ సీరియల్స్, సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జై మల్హర్’ సీరియల్లో లార్డ్ కండోబా పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అలానే వీర్ శివాజీ, దేవయాని, బాజీరావ్ మస్తానీ తదితర చిత్రాల్లోనూ నటించాడు.
డైరెక్టర్ ఓం రౌత్ తీసిన గత చిత్రం ‘తాన్హాజీ’లోనూ సూర్యాజీ మలుసరే పాత్రలో దేవదత్త నటించాడు. ఇప్పుడు ‘ఆదిపురుష్’ లాంటి భారీ బడ్జెట్ చిత్రంతో వరల్డ్ వైడ్ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తనకు హనుమంతుడితో ప్రత్యేక అనుబంధముందని, 17 ఏళ్ల వయసులో తను వర్కౌట్ చేయడం ప్రారంభించి, తన తొలి జిమ్ సెంటర్ కి హనుమాన్ వ్యాయామశాల పేరు పెట్టుకున్నానని దేవదత్త గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ‘ఆదిపురుష్’లో హనుమంతుడి పాత్ర చేసే ఛాన్స్ రావడం సంతోషమని చెప్పాడు. ఈ పాత్ర కోసం శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నట్లు కూడా చెప్పాడు. ఈ సినిమాతో ప్రభాస్, కృతిసనన్, సన్నీ సింగ్.. తనకు మంచి ఫ్రెండ్స్ అయ్యారని కూడా దేవదత్త చెప్పాడు.