దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి విష జ్వరాలు ప్రబలుతాయని అందరికి తెలుసు. ఇక దోమల నివారణకు ప్రభుత్వాలతో పాటు.. ప్రతి ఒక్కరు తగిన చర్యలు తీసుకుంటారు. దోమల బ్యాట్లు, మస్కిటో కాయిల్స్ వంటి వాటిని వినియోగిస్తాం. మన దగ్గర అయితే దోమ కాటు వల్ల వైరల్ ఫీవర్ రావడం ఎక్కువగా జరుగుతుంటుంది. ప్రాణాపాయం జరిగే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. సరే ఆ సంగతి కాసేపు పక్కన పెడితే.. దోమ కాటు వల్ల.. 4 వారాల పాటు కోమాలో ఉండటమే కాక ఏకంగా రెండు వేళ్లు కోల్పోయి.. 30 సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది ఓ వ్యక్తికి. అతడికి ఎదురైన అనుభవం గురించి పూర్తిగా తెలిస్తే.. వామ్మో దోమకాటు ఇంత ప్రమాదకరమా అని అనుకోక మానరు. ఆ వివరాలు..
జర్మనీకి చెందిన ఈ దోమకాటు బాధితుడి పేరు సెబాస్టియన్ రోట్ష్కెకి. వయసు 27 సంవత్సరాలు. ఏడాది క్రితం దోమకాటుకు గురవ్వడంతో.. సెబాస్టియన్ జీవితం ఛిన్నాభిన్నమయ్యింది. దోమ కాటు వల్ల అతడు 4 వారాల పాటు కోమాలో ఉండటమే కాక.. ఏకంగా రెండు వేళ్లు తొలగించాల్సిన పరిస్థితి. అంతేకాక కోలుకోవడం కోసం ఏకంగా 30 ఆపరేషన్లు చేశారు వైద్యులు. అదేంటి దోమ కాటు వల్ల ఇంత విపరీత పరిస్థితులు తలెత్తడం ఏంటి అంటే.. సెబాస్టియన్‌ను కుట్టింది ఆసియా టైగర్ జాతికి చెందిన దోమ.
ఏడాది క్రితం ఈ దోమ సెబాస్టియన్ ఎడమ తొడ మీద కుట్టింది. కుట్టింది దోమే కదా అనుకుని లైట్ తీసుకున్నాడు. కానీ దాని తర్వాత పరిణామాలు ఇంత తీవ్రంగా ఉంటాయని ఆ రోజు అతడు ఊహించలేకపోయాడు. దోమ కాటు వల్ల.. సెరాటియా అనే బ్యాక్టీరియా.. సెబాస్టియన్ శరీరంలోకి ప్రవేశించింది. ప్రారంభంలో ఫ్లూ వంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత పరిస్థితి మరింత విషమించింది. తొడ భాగం మొత్తం పాడవ్వడంతో.. మంచానికే పరిమితం అయ్యాడు. లేవలేని పరిస్థితి.. చివరకు ఓ రోజు అచేతనంగా పడి ఉండటంతో.. అతడిని గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే సెబాస్టియన్‌ని ఆస్పత్రికి తరలించారు.
అలా ఆస్పత్రిలో చేరిన సెబాస్టియన్ 4 వారాల పాటు కోమాలోనే ఉన్నాడు. తొడ భాగం మొత్తం పాడవ్వడంతో.. వైద్యులు అతడికి చర్మ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత మరో 30 రకాల ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. అయినా సరే.. చివరకు అతడి కాలి వేళ్లు రెండింటిని తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని.. కాకపోతే.. ఇక మీదట సెబాస్టియన్ ఆరోగ్యం మునపటిలా ఉండదని వైద్యులు వెల్లడించారు.
పైగా వారానికి ఒకసారి తప్పకుండ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని.. వైద్యులు తెలిపారు. తన పరిస్థితిపై సెబాస్టియన్ స్పందిస్తూ.. ఇలా అన్నాడు.. ‘‘ఒక్క దోమ కాటు.. నా నిండు జీవితాన్ని నాశనం చేసింది. మీలో కూడా ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే.. వెంటనే ఆలస్యం చేయకుండ వైద్యుడిని సంప్రదించండి. ఆలస్యం చేస్తే నాలా మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అంటున్నాడు.