ఇప్పటికే పలు సంస్థలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. తాజాగా ఏఐ మీడియా రంగంలోకి అడుగు పెట్టింది. దీంతో భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్.. ఈ పేరు గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అదే సమయంలో ఎంతోమందిని ఇది కలవరపెడుతుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీ వస్తే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పెడతారన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆర్టిఫీషియల్ టెక్నాలజీ కారణంగా కొంతమంది ఉద్యోగులను తొలగించాయి. మనిషిలానే ఆలోచించి పని చేయడం వల్ల ఈ టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే సాఫ్ట్ వేర్ ఆధారిత సేవల స్థానంలో ఏఐ చాట్ జీపీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అధునాతన సాంకేతికత కారణంగా ఇప్పుడున్న టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు చెందిన కోట్లాది ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీ మీడియా రంగంలోకి ప్రవేశించింది. దీంతో ఏఐ ప్రభావం మీడియా రంగంపై భారీగా ఉంటుందని చెబుతున్నారు. ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ ఆక్సెల్ స్ప్రింగర్.. తమ న్యూస్ రూమ్ సిబ్బందిలో 20 శాతం మందిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. వీరి స్థానాలను ఏఐ టెక్నాలజీతో భర్తీ చేయాలని భావిస్తోంది. ప్రింట్ ప్రొడక్షన్ లో పని చేసే ఎడిటర్లు, ఫోటో ఎడిటర్లు, ప్రూఫ్ రీడర్లు, ఇతర ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. సుమారు 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సంస్థలో వెయ్యి మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ సాయంతో ప్రింట్ మీడియా నుంచి పూర్తిగా డిజిటల్ పబ్లిషర్ గా మారిపోవాలని కంపెనీ భావిస్తుంది. అయితే ప్రింటింగ్ విభాగంలో ఉన్న సిబ్బందిని మాత్రమే తొలగిస్తున్నామని.. జర్నలిస్టులను తొలగించడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఏఐ టెక్నాలజీ వినియోగానికి, ఉద్యోగుల తొలగింపుకి ఎటువంటి సంబంధం లేదని.. ఏఐ టెక్నాలజీ జర్నలిస్టులకు సపోర్ట్ గా ఉంటుందని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఏఐ టెక్నాలజీ పట్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.