సోషల్ మీడియా మన జీవితాలను పూర్తిగా మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ డమ్, సెలబ్రిటీ స్టేటస్ ఎవరి సొత్తు కాదని.. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు అందుకు అర్హులే అని సోషల్ మీడియా నిరూపించింది. అయితే దీని వల్ల ఎన్ని లాభాలున్నాయో.. అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. విపరీత వాడకం, ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం తింగరి వేషాలు వేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం వంటి సంఘటనలు కోకొల్లలు. ఇవన్ని ఒక ఎత్తయితే.. తాజాగా ఈజిప్ట్ లో చోటు చేసుకున్న ఓ సంఘటన అంతకు మించి అన్నట్లు ఉంది. ఓ మహిళ సరదాగా చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె జీవితం పూర్తిగా నాశనం అయ్యింది. ఆ వివరాలు..
ఈజిప్ట్ కు చెందిన అయా యూసఫ్.. స్థానికంగా ఉన్నా పాఠశాలలో టీచర్ గా పని చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆమె తన సహచరులతో కలిసి.. విహార యాత్రకు వెళ్లింది. పిక్నిక్ మధ్యలో ఆమె ఈజిప్ట్ సంప్రదాయ గీతానికి బెల్లీ డ్యాన్స్ చేసింది. దీన్ని కాస్త అయా సహచరులు.. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో కాస్త.. అయా పని చేస్తున్న పాఠశాల యాజమాన్యం దృష్టిలో పడింది. టీచర్ అయి ఉండి.. ఇలా చేయడం పట్ల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక అయాను ఉద్యోగం నుంచి తొలగించింది.
ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయా అశ్లీల నృత్య ప్రదర్శన చేసిందంటూ విమర్శించసాగారు. ఈ క్రమంలో అయా భర్త ఆమెకు మరో ఊహించని షాక్ ఇచ్చాడు. ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు తెలిపాడు. సరదాగా చేసిన పని కాస్త.. అయా జీవితాన్ని నాశనం చేసింది. జరిగిన పరిణామాలపై అయా స్పందిస్తూ.. ‘‘నా సహోద్యోగులు నన్ను మోసం చేశారు. నాకు సమీపంగా కెమరా పెట్టి.. నేను అశ్లీల నృత్యం చేస్తున్నట్లు చిత్రీకరించారు. ఈ వీడియో నా జీవితాన్ని నాశనం చేసింది. ఉద్యోగం పోయింది. నా భర్త విడాకులు ఇచ్చాడు. నా ఇల్లు పోయింది.. జరిగిన పరిణామాల కారణంగా మా అమ్మ ఆస్పత్రి పాలయ్యింది. మా కుటుంబం తలెత్తుకోలేకపోతుంది’’ అని వాపోయింది.
అయాను ఉద్యోగం నుంచి తొలగించడం పట్ల మానవహక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో దేశంలో మహిళల హక్కులపై మరోసారి భారీ ఎత్తున చర్చ ప్రారంభం అయ్యింది. చాలా మంది అయాకు మద్దతుగా నిలవడమే కాక.. ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో జీవితం నాశనం అయిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.