అందాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు చాలా మంది సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారనేది తెలిసిందే. ముఖ్యంగా గ్లామర్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే చిత్ర పరిశ్రమలో ఇది కామన్‌గా మారింది. ముక్కు, పెదవులు లాంటి వాటిని ప్లాస్టిక్ సర్జరీలతో సరి చేసుకున్న కొందరు హీరో, హీరోయిన్ల గురించి మీడియాలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే ఇక్కడో మహిళ మాత్రం అందం కోసం కాకుండా.. దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. తన నేరాన్ని దాచిపెట్టి 25 ఏళ్ల పాటు కొత్త జీవితాన్ని గడిపింది. అయితే చివరకు పోలీసులకు చిక్కింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ మహిళ పేరు చెన్ వైల్. 1997లో యెకింగ్‌లోని చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంకులో క్లర్క్‌గా ఆమె విధులు నిర్వహించేది. ఆ సమయంలో ఒకరోజు బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న ఓ లోపాన్ని ఆమె గుర్తించింది.
బ్యాంకులో ఉన్న నగదును తన అకౌంట్‌లోకి సులభంగా మళ్లించుకునేందుకు ఉన్న అవకాశాన్ని చెన్ వైల్ గ్రహించింది. దీని ప్రకారం తన ఖాతాలోకి ఏకంగా రూ.6.8 కోట్లను జమ చేసుకుంది. ఆ తర్వాత అందులో నుంచి రూ.4.7 కోట్ల మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంది. ఆ డబ్బులతో ఓ ఆస్పత్రికి వెళ్లి ప్లాస్టిక్ సర్జరీతో తన ముఖ రూపురేఖలను పూర్తిగా మార్చుకుంది. పుట్టింటికి వెళ్లి, వారి కోసం అక్కడ కొంత మొత్తంలో డబ్బును దాచింది. ఆ డబ్బులను డ్రా చేసుకునేందుకు వీలుగా అక్కడ అకౌంట్ బుక్‌ను పెట్టింది. ఆమె ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబీకులు ఇది సరికాదని వారించారు. వాళ్లు కొంత సొమ్మును బ్యాంక్‌కు తిరిగి ఇచ్చేశారు. చెన్ వైల్ మాత్రం ఎవరి మాట వినకుండా.. వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింది. అక్కడ తన పేరు, వివరాలు మార్చుకుని మ్యారేజ్ చేసుకుంది. ఆమె ఓ కుమార్తెకు కూడా జన్మనిచ్చింది. వ్యాపారాన్ని మొదలుపెట్టి అందులో రాణించింది. ఆ దొంగతనానికి ముందే ఆమెకు పెళ్లవడం గమనార్హం. చెన్ వైల్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఎన్నోవిధాలుగా ప్రయత్నించారు. 1997 నుంచి వారు దర్యాప్తును కొనసాగిస్తూ వచ్చారు. ఆఖరుకు ఇటీవల ఆమె పోలీసులకు చిక్కింది. మరి, దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునే వారిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.