బయో ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ డెల్టా సహా అన్ని రకాల కరోనా వేరియంట్లపైన సమర్థంగా పని చేస్తోందని అమెరికాకు చెందిన అత్యున్నత సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) తెలిపింది. రెండు అధ్యయనాలు చేసి సదరు సంస్థ ఈ విషయాన్ని నిర్ధారించింది. కొవాగ్జిన్ తీసుకున్న ప్రజల రక్తనమూనాలను వారిలోని యాంటీబాడీస్ ని అధ్యయనాలు చేసింది. ఆల్ఫా – బీ.1.1.7., డెల్టా – బీ.1.617 వేరియంట్లను ఇది సమర్థంగా ఎదుర్కొంటోందని గుర్తించింది. దీనికి సంబంధించి ఎన్ఐహెచ్ మీడియా ప్రకటన విడుదల చేసింది.
కొవాగ్జిన్ చాలా సురక్షితమని, ప్రతిరక్షకాలను తయారు చేయగలుగుతోందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వివరించింది. ఇంకా పబ్లిష్ కాని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ ప్రభావం 78 శాతంగా ఉందని ఎన్ఐహెచ్ పేర్కొంది. కరోనా బారినపడి దాని తీవ్రత ఎక్కువుండి ఆసుపత్రిలో చేరిన వారిలో అయితే వ్యాక్సిన్ ప్రభావం వంద శాతమని చెప్పింది. లక్షణాలు లేని వారిలో 70 శాతం ప్రభావం కనబరిచిందని వివరించింది. ఏ రకంగా చూసినా కొవాగ్జిన్ టీకా చాలా చాలా ప్రభావవంత మైనదని ఎన్ఐహెచ్ ప్రశంసించింది.
తాము అభివృద్ధి చేసిన అడ్జువెంట్ తో కొవాగ్జిన్ మరింత సమర్థంగా తయారైందని పేర్కొంది. అమెరికాలోని వైరోవ్యాక్స్ ఎల్ఎల్ సీ అనే సంస్థ అభివృద్ధి చేసిన అల్ హైడ్రాక్సీక్వియం 2 అనే అడ్జువెంట్ ను భారత్ బయోటెక్ కొవాగ్జిన్ లో వినియోగించింది. సాధారణంగా వ్యాక్సిన్ లేదా ఔషధ సామర్థ్యాన్ని పెంచేందుకు అడ్జువెంట్లను వినియోగిస్తుంటారు.
కొవాగ్జిన్ లో వాడిన అడ్జువెంట్ మిగతా వాటికన్నా శక్తిమంతమైనదని సంస్థ చెబుతోంది. టీఎల్ఆర్7, టీఎల్ఆర్ 8 అనే రిసెప్టర్లను ఇది చాలావేగంగా యాక్టివేట్ చేస్తుందని, శక్తిమంతమైన ప్రతిరక్షకాలు త్వరగా తయారయ్యేలా చూస్తుందని అంటోంది.