ఈ పెద్దాయన వయసు 90 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఏమాత్రం తగ్గటం లేదు. ఆయనకు ఇప్పుడు కూడా వరుస ప్రపోజల్స్ వస్తున్నాయి. ఇంతకూ ఎవరా వృద్ధుడు.. ఎందుకు అతడికి ఇంతలా ప్రపోజల్స్ వస్తున్నాయి..
ఈ ప్రపంచాన్ని శాసించే ప్రధానమైన వస్తువు డబ్బు. డబ్బు మన అవసరాలను, అత్యాశలను తీర్చటమే కాదు.. నలుగురిలోనూ మనల్ని ఉన్నతులుగా చూపిస్తుంది. మనం చేసే మంచి, చెడులకు అతీతంగా సంఘంలో ఓ గుర్తింపు లభిస్తుంది. అందుకే పెద్దలు ‘ధనం మూలం ఇథం జగత్’ అన్నారు. ఈ జగతిలో అన్నిటికి మూలం డబ్బే అని అర్థం. సంపద ఏ రూపంలో ఉన్నా.. వ్యక్తికి ఇచ్చే మర్యాదలో తేడా ఉంటుంది. 10వ తరగతి చదువుతున్న కుర్రాడైనా.. పండు ముసలివాడైనా ఇచ్చే మర్యాదలు గొప్పగా ఉంటాయి. తాజాగా, ఓ వృద్ధుడు తన దగ్గర ఉన్న భారీ బంగారంతో సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. నెట్టింట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతలా అంటే అతడికి ప్రేమ, పెళ్లి ప్రపోజల్స్ వచ్చేంతలా. పూర్తి వివరాల్లోకి వెళితే..
చైనాలోని షాంగ్‌చౌ ప్రాంతానికి చెందిన ఓ 90 ఏళ్ల వృద్ధుడి దగ్గర భారీగా బంగారం ఉంది. దాదాపు 2 కిలోల బరువైన బంగారు ఆభరణాలను అతడు అప్పుడప్పుడూ ధరిస్తూ ఉంటాడు. ఫిబ్రవరి 27న ఆ బంగారు ఆభరణాలను ధరించి ఓ షాపులోకి వెళ్లాడు. అతడి ఆభరణాలు చూసిన ఆ షాపు వారి కళ్లు చెదిరాయి. అక్కడి వారు అతడ్ని ప్రశ్నలు వేస్తూ బంగారం గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు. మరికొంతమంది దాన్ని వీడియోలు తీయసాగారు. సదరు వృద్ధుడు మాట్లాడుతూ.. ‘‘ నా ఒంటిపై ఉన్న బంగారం బరువు 2 కిలోలు ఉంటుంది. దీని విలువ దాదాపు 94 లక్షలు ఉంటుంది. నా దగ్గర ఇది మాత్రమే కాదు.. బంగారం బెల్ట్ కూడా ఉంది.
దాన్ని బయటకు వేసుకురావటం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు’’ అని అన్నాడు. అది విన్న వారంతా షాక్ అయ్యారు. అతడి ఇంట్లో దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన బంగారం ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కొంతమంది అమ్మాయిలు ఆయనకు ప్రపోజ్ చేస్తున్నారు. పెళ్లికి కూడా రెడీ అని అంటున్నారు. ‘అతడు వృద్ధుడు కాదు.. నా బేబీ’అంటూ ఓ యువతి పేర్కొంది. మరి, 90 ఏళ్ల వయసులో 94 లక్షల విలువైన బంగారాన్ని వేసుకుని తిరుగుతున్న ఈ వృద్ధుడి స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.