ప్రేమకు ఎల్లలు ఉండవంటారు. అదే నిజమే కాబోలు అనిపిస్తుంది ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే. పబ్జీ గేమ్ ద్వారా ప్రేమికుడిగా మారిన భారతీయ యువకుడి కోసం నలుగురు పిల్లలతో కలిసి యుపికి వచ్చేసింది సీమా హైదర్ అనే పాకిస్తాన్ మహిళ
ప్రేమకు ఎల్లలు ఉండవంటారు. అది నిజమే కాబోలు అనిపిస్తుంది ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే. పబ్జీ గేమ్ ద్వారా ప్రేమికుడిగా మారిన భారతీయ యువకుడి కోసం నలుగురు పిల్లలతో కలిసి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసింది సీమా హైదర్ అనే పాకిస్తాన్ మహిళ. అంతేనా తమ దేశానికి వెళ్లనంటే వెళ్లనని మొరాయించుకుని కూర్చుంది. అలాగే బంగ్లాదేశ్ మహిళ జూలీది ఇదే వరస. అయితే ఆమె అతడిని బంగ్లాదేశ్ తీసుకెళ్లిపోయిందనుకోండి. పోలండ్ నుండి వచ్చిన మహిళ అయితే.. ఏకంగా ప్రియుడి కోసం ఇల్లు కట్టించేందుకు సిద్ధమైంది. అయితే వీరిలో అంజుదీ మరో కథ. పాకిస్తాన్ యువకుడి కోసం భారత్ నుండి వెళ్లిపోయి.. ప్రేమికుడ్ని పెళ్లాడింది. వీరంతా సోషల్ మీడియా బాధితులే.
అయితే సీమా, జూలీ, అంజు తరహాలో మరో మహిళ ఖండాంతరాలు దాటి ప్రియుడి కోసం వెళ్లిపోయింది. ఇంతకు ఆ మహిళది ఏ దేశం అంటే చైనా. స్నాప్ చాట్ లో పాకిస్తాన్‌కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి, ఆ తర్వాత స్నేహం.. ప్రేమగా మారింది. అతడి కోసం పాక్ వెళ్లేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల గావో ఫెంగ్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుగా ఉన్న పాక్‌లోని బజౌర్ గిరిజన ప్రాంతానికి చెందిన చెందిన 18 ఏళ్ల జావేద్ స్నాప్ చాట్ ద్వారా పరిచయమై.. ప్రేమించుకున్నారు. అతడి కోసం పాక్ వెళ్లాలని భావించి, మూడు నెలల వీసా తీసుకుంది. చైనా నుండి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిట్ మీదుగా ఇస్లామాబాద్ చేరుకుంది. బజౌర్‌లో శాంతిభద్రతల పరిస్థితి కారణంగా జావేద్ ఆ మహిళను తన స్వగ్రామానికి బదులుగా దిగువ దిర్ జిల్లాలోని సమర్‌బాగ్ తహసీల్‌లోని తన మేనమామ ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె మత మార్పిడి చేసుకుని, పేరును కిస్వాగా మార్చుకుంది. వీరిద్దరూ బుధవారం పెళ్లి చేసుకున్నారు.