హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలందించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. అందులో భాగంగానే తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పరిధిలో నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించనున్నది. ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్ లలో 2,679 కోట్ల వ్యయంతో ఆస్పత్రులను నిర్మించేందుకు వైద్య ఆరోగ్య శాఖ పరిపాలనాపరమైన ఉత్తర్వులను గురువారం జారీ చేసింది. 900 కోట్లతో ఎల్బీ నగర్, 882 కోట్లతో సనత్ నగర్, 897కోట్లతో అల్వాల్ ఆసుపత్రులను నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు జీవో ఎం. ఎస్ .41 లో వెల్లడించింది.
ఇప్పటికే గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్ లలోను సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆసుపత్రుల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశిస్తు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీఎస్ఎంఎస్ ఐడీసీని, డీఎంఈలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ ఆసుపత్రులకు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.