జపాన్– బైక్ పై చాలా సేపు ప్రయాణం చేస్తే అలసట వస్తుంది. అలా ఎంతసేపని రోడ్డుపై వెళ్తాం చెప్పండి. అదే బైక్ పై మెల్లగా గాల్లోకి లేచి విమానంలా ప్రయాణిస్తే ఎలా ఉంటుంది. బైక్ పై గాల్లోకి ఎలా వెళ్తాం.. అది సినిమాల్లో మాత్రమే సాధ్యం అవుతుంది కదా.. అని అనుకుంటున్నారు కదా. అవును నిజమే మనం బైక్ లు, కార్లు గాల్లోకి ఎగరడం సినిమాల్లోనే చూశాం. కానీ ఇప్పుడు అది నిజజీవితంలోను నిజం కాబోతోంది.
రోడ్డపై బైక్ పై వెళ్తూ వెళ్తూ అలాగే గాల్లోకి ఎగిరే బైక్ కలను జపాన్ సాకారం చేసింది. జపాన్ కు చెందిన ఏఎల్‌ఐ టెక్నాలజీస్ అనే స్టార్టప్ సంస్థ ఈ సూపర్ బైక్ ను తయారుచేసింది. ఈ బైక్ పేరు ఎక్ టూరిస్మో హోవర్ బైక్. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో సుమారు 40 నిమిషాల పాటు ఈ బైక్ ఎగరగలదు. త్వరలో పూర్తి విద్యుత్తుతో నడిచేలా కూడా మరో బైకును విడుదల చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.
ఫ్యూజీలోని గ్రాండ్ స్టాండ్ లో తాజాగా ఈ హోవర్ బైక్ ను ఏఎల్‌ఐ సంస్థ ప్రదర్శించింది. సక్సెస్ ఫుల్ గా ఈ సూపర్ బైక్ గాల్లోకి ఎగిరింది. ఈ బైక్ ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. అంతా బాగానే ఉన్నా ఈ బైకుల్లో ఒక చిన్న సమస్య ఉంది. ఈ బైక్ కు మొత్తం ఆరు రోటర్ బ్లేడ్ లు అమర్చడంతో ఇది గాల్లో ఎగిరితే.. చెవులు కచ్చితంగా మూసుకోవాల్సిందే.
అన్నట్లు ప్రస్తుతానికి కేవలం 200 బైకులను మాత్రమే ఏఎల్‌ఐ తయారు చేస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఐతే ఈ సూపర్ బైక్ ధర కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఎక్ టూరిస్మో హోవర్ బైక్ ధర 5.10 కోట్ల రూపాయలు. ఇంత భారీ ధర అయినా ఇప్పటికే 30 బైక్స్ వరకు బుకింగ్ అయ్యాయట.