మహిళలపై దాడులు ఆగడం లేదు. దేశంలో ఏదో ఓ మూలన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తండ్రి, భర్త, స్నేహితుడు, బంధువుల రూపంలో నర రూప రాక్షసులు మహిళలపై దాడి చేస్తున్నారు. తాజాగా జమ్ముకాశ్మీర్ లో స్నేహితుడే ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టాడు.
దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చట్టాలు ఎన్ని వస్తున్నా నిరుపయోగంగా మారుతున్నాయి. తప్పు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయన్న భయం ఏ మాత్రం నిందితుల్లో కలగడం లేదు. మహిళల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రేమ, పెళ్లి, కామ కోరికలతో మహిళలు, అమ్మాయిల పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. పలు కారణాలతో బలై పోతున్న వారంతా బాధితులకు బాగా తెలిసిన వారే కావడం గమనార్హం. తాజాగా జమ్ముకాశ్మీర్ లో ఓ వైద్యురాల్ని అతడి స్నేహితుడు మట్టుపెట్టాడు. దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరుగుతుంటే.. అతడూ మాత్రం రక్తపు మడుగుల్లో తడిశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వ్యక్తి ఫేస్ బుక్‌లో పోస్టు చేయడంతో కంగారు పడ్డ స్నేహితులు, బంధువులు జమ్ములోని జానీపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. జానీపూర్ లోని అతడి నివాసానికి వచ్చిన పోలీసులు ఇంటికి తాళం వేసి ఉండటంతో పగుల గొట్టి వెళ్లి చూడగా ఓ యువతి రక్తపు మడుగుల్లో పడి ఉంది. ఆ పక్కనే యువకుడు కూడా గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే యువతి చనిపోయింది. యువకుడికి మాత్రం చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే వీరిని సుమేధ శర్మ, జోహార్ గైనీలుగా పోలీసులు గుర్తించారు.
జమ్ముకాశ్మీర్‌లోని గోల్ పులి తలాబ్ తిల్లీ నివాసి అయిన సుమేధ, జోహార్ సయోదా డెంటల్ కాలేజీలో బీడీఎస్ చదివారు. వీరిద్దరికీ ఎనిమిదేళ్ల నుండి పరిచయం ఉంది. ప్రస్తుతం సుమేధ ఢిల్లీలో ఓ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తుండగా.. జోహార్ జమ్ములో ఉంటున్నాడు. హోలీ పండుగ రోజు జానీపూర్‌లోని షాంపోష్ కాలనీలో ఉంటున్న జోహార్ ఇంటికి వచ్చింది సుమేధ. వీరిద్దరికీ ఏదో విషయంపై గొడవ జరగ్గా.. కోపంతో ఊగిపోయిన జోహార్ వంటగదిలోని కత్తితో ఆమెపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. పలు చోట్ల కత్తితో దాడి చేయడంతో ఆమె నేలకొరిగింది. అనంతరం అతడూ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో చూసిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి చూడగా.. రక్తపు మడుగుల్లో సుమేధ, జోహార్ ఉన్నారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. సుమేధ చనిపోయినట్లు తేలింది. నిందితుడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.