త్వరగా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారుల్లో నడుస్తున్నారు. అమాయకులకు వల వేసి, మాయ మాటలతో మభ్య పెట్టి, లక్షల్లో దండుకుంటున్నారు. భార్యలు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న పురుషులను లక్ష్యంగా చేసుకున్నాడు ఓ కేటుగాడు.
దేశంలో మోసగాళ్లకు కొదవలేదు. మోసపోయే అమాయకులు ఉన్నంత కాలం వీరి ఆటలు సాగిపోతుంటాయి. డబ్బును సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతూ ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. మంచి మాటలతో మనుషుల్ని బురిడీ కొట్టించి.. డబ్బులు కాజేస్తున్నారు. తమను నమ్మిన వాళ్లను, వారి వేలితోనే వారి కంట్లో పొడుచుకునే విధంగా చేస్తున్నారు. ఒక వ్యక్తిని మోసం చేసిన అతడి నుండి డబ్బులు మొత్తం ఖాళీ అయిపోయాక, మరొకరిని టార్గెట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంటున్నారు కేటుగాళ్లు. ఈజీ మనీ కోసం ఏకాంత పురుషుల్ని లక్ష్యంగా చేసుకున్నాడో మోసగాడు.
భార్యలు దూరమై మలి దశలో ఉన్న పురుషులను లక్ష్యంగా చేసుకుని తన పన్నాగాన్ని సిద్ధం చేసుకున్నాడు కర్ణాటకు చెందిన శివకుమార్. పెళ్లి పేరుతో నమ్మించి, ఓ యువతితో వివాహం జరిపి డబ్బులు దండుకునేవాడు. చివరకు అతడి బండారం బయట పడింది. ఒకరిని కాదూ ఇద్దర్ని కాదూ నలుగుర్ని మోసం చేసినట్లు తేలింది. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లికి చెందిన లక్ష్మణ్‌కు నలుగురు పిల్లలు. 20 ఏళ్ల క్రితం భార్య మృతిచెందింది. మలిదశలో ఓ తోడు కావాలని భావించిన అతడు కర్ణాటకకు చెందిన శివకుమార్‌ను సంప్రదించాడు. సంబంధాలు వెతుకున్నానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన యువతితో లక్ష్మణ్‌కు వివాహం జరిపించాడు
కొద్ది రోజులు గడిచాక.. ఆ యువతి తల్లి దగ్గరికి వెళ్లి వస్తానని భర్తతో చెప్పింది. అలా వెళ్లిన యువతి ఎంతకూ తిరిగి రాకపోవడంతో మధ్యవర్తి శివకుమార్‌కు లక్ష్మణ్ ఫోన్ చేసి అడిగాడు. వారం, పది రోజుల్లో వస్తుందంటూ చెప్పుకుంటూ రాసాగాడు. ఎన్ని రోజులకు ఆమె రాకపోయే సరికి లక్ష్మణ్ తాను మోసపోయినట్లు గ్రహించాడు. అలా శివ కుమార్ అదే యువతితో మరో ఇద్దరికి కూడా వివాహం చేసి.. లక్షల్లో డబ్బులు దండుకునేవాడు. ఆ యువతిని కూడా చాకచక్యంగా వారి నుండి తప్పించేవాడు. మరో పెళ్లికి తెరలేపేవాడు. అలా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన పల్లి మండలానికి చెందిన ఓ యువకుడితో అదే యువతితో పెళ్లి ఒప్పందం కుదుర్చుకుని వేముల వాడకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్ అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.