అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటూ, మూడు రాజధానుల రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జగన్ సర్కార్, మరో కీలక బిల్లును రద్దు చేసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సమాచారం.
గతంలో శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ మరో కొత్త తీర్మానాన్ని తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనవరి 2020లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, మూడు రాజధానుల బిల్లులను శాసనమండలి వ్యతిరేకించింది.
ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేసింది. 151 స్థానాలున్న అసెంబ్లీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని, ప్రజాబలంతో గెలిచిన శాసనసభ నిర్ణయాన్ని టీడీపీ బలం ఎక్కువగా ఉన్న మండలి వ్యతిరేకించిందని సీఎం జగన్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే శాసన మండలి నిర్వహణకు రోజూ లక్షల రూపాయల భారం పడుతోందని, శాసన మండలిని రద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతూ గత ఏడాది జనవరి 27న శాసనసభలో తీర్మానం పెట్టి, దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించింది జగన్ సర్కార్.
ఐతే గత సంవత్సరం నుంచి శానసమండలి రద్దు వ్యవహారం పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం శాసనమండలిలో బలాబలాలు చూస్తే వైసీపీకి ఆధిక్యం వచ్చింది. అందుకే శాసన మండలి రద్దుపై జగన్ సర్కార్ వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. శాసన మండలి రద్దు తీర్మాణాన్ని ఉపసంహరించుకుని, ఆ తీర్మానం కాపీని కేంద్రానికి పంపించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుందని సమాచారం.