స్పెషల్ డెస్క్- అతడి ఫోన్ కు బ్యాంకు నుంచి మెస్సేజ్ వచ్చింది. తీరా చూస్తే అతడి బ్యాంక్ ఖాతాలో 5 లక్షల 50 వేల రూపాయలు డిపాజిట్ అయ్యాయని మెస్సేజ్ లో ఉంది. తన అకౌంట్ లోకి డబ్బులు రావడమేంటని, వెంటనే ఏటీఎం సెంటర్ కు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. నిజంగానే అతని అకౌంట్ లో 5లజ్ఞల 50 వేల రూపాయలు జమయ్యాయి. ఇక అతడు ఏమాత్రం ఆలోచించలేదు. తన అవసరాల మేర ఆ డబ్బులను దర్జాగా ఖర్చు పెట్టేశాడు.
అసలేం జరిగిందంటే.. బిహార్‌లోని ఖగారియా ప్రాంతానికి చెందిన రంజిత్ దాస్ అనే వ్యక్తికి స్థానికంగా ఉన్న గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ సంవత్సరం మార్చి నెలలో బ్యాంకు అధికారుల పొరపాటు వల్ల రంజిత్ ఖాతాలో 5 లక్షల 50 వేల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఆ డబ్బును రంజిత్ ఖర్చు పెట్టేశాడు. తాజాగా బ్యాంకు అధికారుల నుంచి అతడికి ఫోన్ వచ్చింది. మీ అకౌంట్ లో పొరపాటున 5లక్షల 50 వేల రూపాయలు డిపాజిట్ అయ్యాయి.. దయచేసి ఆ డబ్బును తిరిగి ఇచ్చేయండి అని బ్యాంకు వాళ్లు అసలు చెప్పారు.
దీంతో రంజిత్ కు ఒక్కసారిగా షాక్ తగిలింది. దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని ప్రధాని మోదీ చెప్పారు కదా, మార్చి నెలలో నా ఖాతాలో పడిన డబ్బు దానిలో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ అనుకున్నానని, ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశాను, ఇప్పుడు తిరిగి ఇవ్వడం కుదరదని కూల్ గా చెప్పేశాడు రంజిత్. దీంతో బ్యాంకు అధికారులకు ఏంచేయాలో తోచలేదు.
ఇక చేసేది లేక బ్యాంకు మేనేజరు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు సైతం రంజిత్ ఇదే విషయాన్ని చెప్పాడు. తన అకౌంట్ లో జమైన డబ్బులు ప్రధాని మోదీ ఇచ్చారనుకుని ఖర్చు చేశానని, ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ లేదని చేతులెత్తేశాడు. దీంతో అతడి నుంచి ఆ డబ్బులు ఎలా రికవరీ చేయాలబ్బా అని పోలీసులు తలలు పట్టుకున్నారు.