విజయ్ దేవరకొండ.. లైగర్ ఫలితం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇటీవలే లైగర్ సినిమా రిజల్ట్ గురించి కూడా స్పందించాడు. మేము ఆశించిన ఫలితం రాలేదు.. అంటూ రౌడీ బాయ్ ఎమోషనల్ అవ్వడం చూశాం. ప్రస్తుతం శివ నిర్వాణం దర్శకత్వంలో సమంతతో కలిసి ఖుషీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఇంకా లైగర్ ఫలితం దగ్గరే ఉండిపోయారు. పూరీ- విజయ్ కాంబోలో వచ్చిన లైగర్ ఫలితం అతని కెరీర్ మీదే కాదు.. జేజీఎం సినిమపై కూడా పడింది. పూరీ- విజయ్ ఇద్దరూ జేజీఎం సినిమా గురించి ప్రస్తావన తీసుకురావడం లేదు. ప్రస్తుతానికి అయితే దానిని అటకెక్కించారు అనే చెప్పాలి.
ఇప్పుడు విజయ్ దేవరకొండ కెరీర్‌కు సంబంధించిన ఒక వార్త వైరల్‌గా మారింది. అదేంటంటే.. త్రివిక్రమ్- విజయ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది అని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఆ సినిమా దాదాపుగా ఓకే అయ్యిందని చెబుతున్నారు. త్రివిక్రమ్- రౌడీ హీరోకి ఓ కథ లైన్ చెప్పినట్లు.. అది విజయ్‌కి బాగా నచ్చినట్లు చెబుతున్నారు. ఇంక త్రివిక్రమ్ సైతం ఆ లైన్‌ని డెవలప్ చేసి మంచి కథగా మలిచేందుకు కసరత్తు కూడా ప్రారంభించాడంట. ఈ సినిమాతో అయినా రౌడీ హీరో కెరీర్ మళ్లీ తిరిగి పట్టాలెక్కుతుందని అతని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది.
శుభవార్త చెప్పినట్లే చెప్పి.. మళ్లీ మెలిక అంటున్నారు అనేగా మీ సందేహం. అవును త్రివిక్రమ్ శుభవార్త చెప్పాడు కానీ, అది సగం గుడ్ న్యూస్ మాత్రమే అంటున్నారు. అదేంటంటే.. కథ, మాటలు, స్క్రీన్ ప్లే మొత్తం తానే అందిస్తానని త్రివిక్రమ్ హామీ ఇచ్చాడంట. కానీ, డైరెక్షన్ మాత్రం తాను చేయనని చెప్పాడంట. అది ఎందుకు అంటే.. ప్రస్తుతం త్రివిక్రమ్- మహేశ్ బాబు సినిమా నడుస్తున్న విషయం తెలిసిందే. మహేశ్ బాబు 28వ సినిమా మూలంగా తాను కేవలం కథ, స్క్రీన్ ప్లే, మాటలు మాత్రమే అందిస్తానని చెప్పుకొచ్చాడంట. అయితే ఆ డైరెక్షన్ అవకాశం ఎవరో ముక్కు మొఖం తెలియని వారికి కాదులెండి.. శశి కిరణ్ తిక్కకు ఆ అవకాశం ఇస్తున్నట్లు చెబుతున్నారు.
శశి కిరణ్ తిక్క డైరెక్టర్‌గా ఇప్పటికే గూఢాచారి, మేజర్ చిత్రాలతో తానేంటో నిరూపించుకున్నాడు. త్రివిక్రమ్ రెడీ చేయబోయేది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ కావడం వల్లే శశి కిరణ్ తిక్కను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఆ జానర్‌లో సినిమా డైరెక్ట్ చేయడంలో అతను దిట్ట అని త్రివిక్రమ్‌కి మాత్రమే కాదు.. తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. ఈ మూవీని హారికా హాసినీ క్రియేషన్స్ కి అనుబంధ సంస్థగా ఉన్న సితార ఎంటర్‌టైన్మెంట్స్ తెరకెక్కిస్తుందని చెబుతున్నారు. అయితే త్రివిక్రమ్-విజయ్ దేవరకొండ- శశి కిరణ్ తిక్క కాంబోలో రాబోతుందని చెబుతున్న సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి.. ఈ సినిమా అయినా విజయ్ దేవరకొండ ట్రాక్ మారుస్తుందేమో చూడాలి.