స్పెషల్ డెస్క్- అప్పట్లో కాదేది కవితకనర్హం అన్నారో కవి. కానీ ఇక్కడో వ్యక్తి కాదేది తస్కరించేందుకనర్హం అంటున్నాడు. అనడమే కాదు ఆచరణలో పెట్టి చూపించాడు. ప్రస్తుతం కరోనా కాలం కావడంతో ప్రతి చోట సానిటైజర్ ను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరు సానిటైజర్ ఉపయోగిస్తున్నారు. బ్యాంకుల ఏటీఎంలలో కూడా సానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు. కాని, అవి పెట్టిన కొన్ని రోజులకే మాయమైపోతున్నాయి. దీంతో బ్యాంకు నిర్వాహకులు ఏటీఎంల వద్ద సానిటైజర్లు పెట్టడమే మానేశారు. ఇంతకీ బ్యాంకుల ఏటీఎంల దగ్గర సానిటైజర్ బాటిల్స్ ఎలా మాయం అవుతున్నాయనే కదా మీ సందేహం. ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వారు డబ్బులతో పాటు, అక్కడ ఉన్న సానిటైజర్ బాటిల్స్ కూడా ఎత్తుకెల్తున్నారు.
ఇలా ఓ ఎటీఎంలో ఓ కస్టమర్ సీనిటైజర్ బాటిల్ ను దొంగిలిస్తుండగా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అందులో ఓ కస్టమర్ డబ్బులు డ్రా చేసుకోడానికి ఏటీఎంకు వచ్చాడు. అందులో కస్టమర్లు చేతులు శుభ్రం చేసుకోడానికి ఏర్పాటు చేసిన సానిటైజర్ బాటిల్ మీద అతడి కన్ను పడింది. అతడు డబ్బులు డ్రా చేస్తున్నాడేగానీ.. తన చూపంతా ఆ సానిటైజర్ బాటిల్ మీదే ఉంది. డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత.. అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో ఆ సానిటైజర్ బాటిల్ తీసేసి తన బ్యాగులో పెట్టేసుకుని చల్లగా జారుకున్నాడు. 33 సెకన్ల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దయచేసి మీరు మాత్రం ఇలాంటి పని చేసి మీ పరువు తీసుకోవద్దు. ఈ కరోనా సమయంలో తోటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా సురక్షితంగా ఉంటామనే విషయాన్ని గుర్తుంచుకోండి.