కొడుకు అంటేనే వారసులు అని ఫిక్స్ అయిపోతారు. వారసుడు మాత్రమే తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు. కన్న కొడుకైతేనే వారు కన్న కలలని నిజం చేస్తాడు అని అనుకుంటారు. కానీ కొడుకే కాదు.. కూతుర్లు కూడా తల్లిదండ్రుల కలలను నిజం చేస్తారు. వారసులుగా మగాళ్లకేం తీసిపోని విధంగా ప్రేమ కురిపిస్తారు. ఈ విషయాన్ని జబర్దస్త్ ఫైమా నిరూపించింది. ఎన్నో ఏళ్ల తన తల్లిదండ్రుల కలను నిజం చేసింది.
తల్లిదండ్రులు జన్మనిస్తారు. జీవితాన్ని ఇస్తారు. బంగారు భవిష్యత్తుకి ఒక బాట వేస్తారు. ఈ క్రమంలో వారు ఎన్నో కోల్పోతారు. ఆశలను, కోరికలను పక్కన పెట్టి పిల్లల కోసమే తమ జీవితాలను త్యాగం చేస్తారు. మరి అలాంటి తల్లిదండ్రుల ఆశలు ఏంటో అడిగి తెలుసుకుని నెరవేర్చడం పిల్లల బాధ్యతే కదా. సక్సెస్, డబ్బు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు తమకి ఒక హోదా వచ్చాక తమ తల్లిదండ్రుల కోరికలు నెరవేరుస్తారు. ఈ కోవలో జబర్దస్త్ ఫైమా కూడా తన తల్లిదండ్రుల కోరిక నెరవేర్చేందుకు సిద్ధమైంది. పటాస్, జబర్దస్త్ షోల ద్వారా పాపులర్ అయిన ఫైమా.. ప్రస్తుతం ఆర్థికంగా బాగా స్థిరపడింది.
అమ్మాయి అయి ఉండి, మారుమూల గ్రామం నుంచి, పేదరికం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే తన ఎదుగుదలకు కారణమైన అమ్మ, నాన్నల కోసం ఏదైనా చేయాలని భావించిన ఫైమా.. వారి కల నెరవేర్చే దిశగా అడుగులు వేసింది. అందులో మొదటిది సొంత ఇల్లు. చిన్నప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉన్నామని, సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది అని తన తల్లిదండ్రులు ఆశపడేవారని.. మొత్తానికి వారి ఆశలు ఫలించాయని ఫైమా వెల్లడించింది. తన అమ్మ, నాన్నల కోసం ఇల్లు అయితే కొన్నానని.. ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ లు జరుగుతున్నాయని వెల్లడించింది. ప్రస్తుతానికైతే తమకంటూ ఒక సొంత ఇల్లు ఉందన్న సంతోషం ఉందని చెప్పుకొచ్చింది.
ఇక రెండవ కల.. కారులో తిరగడం. తన ఇంట్లో కొడుకులు లేరు. ఎవరైనా కొడుకులు తమ పేరెంట్స్ ని కారులో ఎక్కించుకుని పోతుంటే తన తల్లిదండ్రుల ముఖాల్లో బాధ గమనించానని ఆమె వెల్లడించింది. ఆ బాధను స్కూటీ తీసుకోవడం ద్వారా సగం తీర్చానని పేర్కొంది. కొంచెం కొంచెం కింద నుంచి పైకి వస్తున్నామని.. తన తల్లిదండ్రుల కోరికలు నెరవేరుస్తున్నానని వెల్లడించింది. ఈసారి ఈ స్టేజ్ లో వాళ్ళకంటూ ఏదో ఒకటి చేయాలని.. మిగతా సగం ఆనందాలను వాళ్లకి అందించాలని నిర్ణయించుకుంది. అందుకోసం తన తల్లిదండ్రులను కారులో తిప్పడం కోసం కారు కొనేందుకు షోరూం కి వెళ్ళింది.
ఇద్దరినీ షోరూంకి తీసుకెళ్లి నచ్చిన రంగు కారు కొనాలని అనుకుంది. అయితే ఫైమా తండ్రి ఊరికి వెళ్లడం వల్ల తల్లిని తీసుకుని వెళ్ళింది. కారు షోరూంలో కారుని చూపించింది. కారుకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది. అమ్మ, నేను రెండు కార్లు ఎంపిక చేశామని.. కారు అమ్మకి, నాన్నకి తీసుకుంటున్నా కాబట్టి నాన్నని కూడా అడిగి ఫైనల్ చేస్తామని వెల్లడించింది. అతి త్వరలోనే కారులో తిరగబోతున్నాం అని సంతోషాన్ని వెల్లడించింది. మరి అమ్మ, నాన్నల కోసం ఇల్లు కొని, ఇప్పుడు కారు కూడా కొని అందులో తిప్పడానికి రెడీ అయ్యింది. ఎవరికైనా ఇల్లు, కారు ఈ రెండే కలలు ఉంటాయి. అలాంటి కలలను నిజం చేసి కొడుకుకేమీ తక్కువ కాదని నిరూపించిన ఫైమాపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.