సెలబ్రిటీ టాక్ షోలు ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటాయి. అందులోనూ ప్రతివారం షోకి వచ్చే సెలబ్రిటీలు మారుతుంటారు. వారి సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ ఇలా అన్ని విషయాలు షేర్ చేస్తుంటారు. సెలబ్రిటీ టాక్ షోలలో ప్రేక్షకులకు బాగా దగ్గరైన వాటిలో ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం మొదటి స్థానంలో ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా నటుడు ఆలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో.. ప్రతి సోమవారం ప్రసారం అవుతుంది. తాజాగా వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈసారి షోలో ప్రముఖ సినీ రచయిత వక్కంతం వంశీ, ఆయన భార్య ‘ఆట’ శ్రీవిద్య హాజరయ్యారు.
ఇక హోస్ట్ ఆలీ అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పిన వంశీ.. సినీ కెరీర్ తో పాటు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. అయితే.. సినీ రచయితగా కంటే ముందు వంశీ పలు సినిమాలలో నటించాడు. అంతకుముందు న్యూస్ రీడర్ గా కూడా వర్క్ చేశాడు వంశీ. ఈ క్రమంలో వంశీ భార్య శ్రీవిద్య ఎంట్రీ ఇచ్చింది. ఆట షో ద్వారా పాపులర్ అయిన శ్రీవిద్యను ఇప్పుడు చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. లావుగా ఉండే శ్రీవిద్య ఇప్పుడు సన్నగా మారిపోయి కనిపించడం విశేషం.
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నువ్వు? ఎందుకని ఈ మధ్య కనిపించట్లేవు? నిన్నెవరైనా బాధపెట్టారా? అని ఆలీ అడిగాడు. ఆలీ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ శ్రీవిద్య ఎమోషనల్ అయిపోయింది. ఆమె మాట్లాడుతూ.. “బాధ అనే దానికన్నా పెద్ద పదం ఏదైనా పెట్టాలి. మాకు ఓ పాప, బాబు ఉన్నారు. వాళ్ళకంటే ముందు ఓ బాబు పుట్టి చనిపోయాడు. నా కళ్ళముందే ఆ బాబు పుట్టడం.. నాలుగు నిమిషాల్లో చనిపోవడం.. అంతా జరిగిపోయింది” అని కన్నీరు పెట్టుకుంది. శ్రీవిద్య మాటలకు హోస్ట్ ఆలీ కూడా ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.