బాలీవుడ్లో బయోపిక్స్ ట్రెండ్ రోజు రోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా క్రికెటర్ల జీవితకథలతో సినిమాలు తీయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు దర్శక-నిర్మాతలు. ధోని, అజార్, సచిన్ బయోపిక్స్ తర్వాత కపిల్ దేవ్ జీవితకథతో ’83’ సినిమా రాబోతుంది. ఇక తాజాగా.. మరో క్రేజీ క్రికెటర్ గంగూలీ జీవితకథతో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట.
భారత అత్యుత్తమ క్రికెటర్లలో సౌరభ్ గంగూలీ ఒకడు. 1996 నుంచి 2008 వరకూ భారత క్రికెట్ టీమ్ లో కొనసాగాడు గంగూలీ. కెప్టెన్గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న దాదా క్రీజులో సిక్సర్ల పిడుగుగా పేరు సంపాదించాడు. బి.సి.సి.ఐ. అధ్యక్షుడిగానూ తనదైన మార్క్ చూపించాడు గంగూలీ. ఇక బెంగాల్ టైగర్ గంగూలీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన పనిలేదు. పర్సనల్ లైఫ్ లోనూ గంగూలీ దూకుడే వేరు.
కథానాయిక నగ్మాతో ఎఫైర్ విషయంలోనూ దాదా పేరు మార్మోగింది. ఇలా.. ఎన్నో ఎమోషన్స్ దాగి ఉన్న గంగూలీ జీవితకథతో సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని గంగూలీ కూడా కన్ఫమ్ చేశాడు. ఇక.. ఆన్ స్క్రీన్ పై గంగూలీగా కనిపించబోయేది రణ్ బీర్ కపూర్ అనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే సంజయ్ దత్ బయోపిక్ తో సూపర్ హిట్ అందుకున్న రన్ బీర్.. ఇప్పుడు గంగూలీ బయోపిక్ లోనూ నటిస్తాడట. త్వరలోనే.. ఈ క్రేజీ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్టు బీటౌన్ టాక్. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇండియన్ టీమ్ ని మంచి స్థితికి తీసుకుని రావడం, ఇంగ్లాండ్ లార్డ్స్ లో షర్ట్ విప్పి తిప్పడం, ఆసీస్ దూకుడికి కళ్లెం వేయడం, యువ క్రికెటర్స్ ని తెరపైకి తీసుకుని రావడం, ఛాపెల్ వచ్చాక టీమ్ లో ప్లేస్ కోల్పోయి రంజీలు ఆడటం, ఆ తరువాత కమ్ బ్యాక్ కింగ్ అని పేరు తెచ్చుకోవడం.. ఇలా ఒకటేంటి ఒక కమర్షియల్ సినిమాకి సరిపోయే అన్నీ అంశాలు గంగూలీ జీవితంలో ఉన్నాయి. మరి.. ఇంత మంచి ఛాన్స్ ని మేకర్స్ ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.