మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్స్ లో మాస్ మహారాజా రవితేజ ముందు వరుసలో ఉంటారు. “క్రాక్” మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ నుండి వస్తున్న తదుపరి మూవీ కావడంతో “ఖిలాడి” పై క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. కరోనా కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన “ఖిలాడి” ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ నేపథ్యంలో “ఖిలాడి” మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:
గాంధీ (రవితేజ) ఒక అనాథ. అతణ్ని రాజశేఖర్ అనే పెద్ద మనిషి ఆదరిస్తారు. తనని పెంచి, పెద్ద చేసిన రాజశేఖర్ అంటే గాంధీకి విపరీతమైన గౌరవం. కానీ.. హోం మినిస్టర్ గురుసింగం (ముకేష్ రుషి) సీఎంకు సంబంధించిన పది వేల కోట్ల రూపాయల డబ్బుల డీల్ లో రాజశేఖర్ ఇరుక్కుంటాడు. ఈ క్రమంలోనే గాంధీ తన కుటుంబాన్ని సైతం కోల్పోతాడు. అయినవాళ్ళని గాంధీనే చంపాడని గాంధీ జైలు పాలవుతాడు. ఆ సమయంలో గాంధీ కూతురు అనాధ అవుతుంది. ఆ పాపకి సైకాలజీ స్టూడెంట్ అయిన పూజ (మీనాక్షి చౌదరి) అండగా నిలుస్తుంది. కోర్టులో స్పెషల్ పిటిషన్ వేసి గాంధీకి బెయిల్ వచ్చేలా చేస్తుంది. కానీ.. అప్పుడే గాంధీ నిజస్వరూపం బయట పడుతుంది. ఇంతకీ ఎవరీ గాంధీ? పది వేల కోట్ల డబ్బుల డీల్ తో అతడికి సంబంధమేంటి? చివరికి ఆ డబ్బు ఏమైంది? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ:
సినిమాలో ఎంత పెద్ద స్టార్ ఉన్నా.. ఆ హీరో చేత తన్నించుకోవడానికి, పంచ్ డైలాగులు వేపించుకోవడానికి ఎంతమంది విలన్స్ ఉన్నా.. కథ, కథనం అనేవి మాత్రం చాలా ముఖ్యం. ముఖ్యంగా.. సస్పెన్స్ యాక్షన్ మూవీకి లాజిక్స్ చాలా ముఖ్యం. కానీ.. ఖిలాడిలో ఇవే మిస్ అయ్యాయి. హీరో క్యారెక్టరైజేషన్ ని హైలెట్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అంతా ఒక అబద్దంగా, లాజిక్ లేకుండా చూపించడం దగ్గరే ఖిలాడి స్థాయి పడిపోయింది. కానీ.. సెకండ్ ఆఫ్ లో మాత్రం మాస్ మహారాజా ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ సీక్వెన్స్ లకి కొదవలేదు. అయితే.. ప్రతి 15 నిమిషాలకి ఒకసారి వచ్చే ట్విస్ట్ లలో ఎక్కడా లాజిక్ కనిపించదు. దర్శకుడు రమేష్ వర్మ కమర్షియల్ మీటర్ పై పెట్టిన శ్రద్ద కథాకథనాలపై పెట్టి ఉంటే ఖిలాడి స్థాయి మరోలా ఉండేది.
గాంధీ పాత్రలో రవితేజ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అమాయకంగా కనిపిస్తూ.. సెకండ్ ఆఫ్ లో తన మార్క్ మాస్ యాక్షన్ తో చెలరేగిపోయాడు. ఇక హీరోయిన్స్(డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి) ఇద్దరూ అందాల ప్రదర్శనకే పరిమితం అయిపోయారు. రావు రమేశ్ కి మంచి పాత్ర లభించింది. పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ పాత్ర తేలిపోయింది. ఇక అనసూయ మాత్రం ఖిలాడి కోసం కాస్త ఘాటుగానే అందాలను ఆరబోసింది. టెక్నికల్ గా ఖిలాడిలో ఎక్కడా లోపాలు కనిపించవు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. దర్శకుడిగా సక్సెస్ అయిన రమేష్ వర్మ.. రచన పై దృష్టి పెట్టకపోవడమే ఖిలాడి కొంప ముంచింది.
ప్లస్ పాయింట్స్:
రవితేజ
హీరోయిన్స్ స్కిన్ షో
మ్యూజిక్
సెకండ్ ఆఫ్ లో యాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
ఫస్ట్ హాఫ్
లాజిక్ లేని ట్విస్ట్ లు
చివరి మాట:
ఖిలాడి.. లాజిక్ మిస్ అయిన కిచిడి!
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.