క్రేజీ కాంబినేషన్స్ కి ఉండే క్రేజే వేరు. ఇలాంటి కాంబినేషన్ అంటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అందులోనూ కింద నుంచి పైకొచ్చిన ఇద్దరు స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఇక మామూలుగా ఉండదు. అలాంటి కాంబినేషనే ఇప్పుడు టాలీవుడ్ లో సెట్ అయ్యింది. అదే మెగా మాస్ కాంబో. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ కాంబోలో ఓ సినిమా రాబోతుంది.
ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన మెగా మాస్ అప్ డేట్ బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా మొదలైన షెడ్యూల్ లో రవితేజ నటిస్తున్నారు.
మెగాస్టార్ 154వ సినిమాలో రవితేజ నటిస్తున్నారని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందించలేదు. కానీ తాజాగా అయితే ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మెగాస్టార్ తో మాస్ మహరాజా జత కలిశారంటూ ఓ టీజర్ ను రిలీజ్ చేశారు. ‘ద మాస్ ఫోర్స్ జాయిన్స్ ద మెగా స్టార్మ్’ అనే క్యాప్షన్ తో టీజర్ విడుదలయ్యింది.
టీజర్ ఓపెనింగ్ షాట్ లోనే.. రవితేజ చిరుతపులిలా రేంజ్ రోవర్ కార్ లో దూసుకొస్తూ.. షూటింగ్ జరుగుతున్న లొకేషన్ లోకి వచ్చారు. కారు డోర్ ఓపెన్ చేసి స్టైలిష్ గా దిగి.. మెగాస్టార్ కారవాన్ దగ్గరకి నడుచుకుంటూ వెళ్లారు. కారవాన్ తలుపు తట్టగానే చిరంజీవి డోర్ తీశారు. అన్నయ్య అంటూ రవితేజ పిలవగానే.. హాయ్ బ్రదర్, వెల్కమ్ అంటూ చిరు రవితేజకు షేక్ హ్యాండ్ ఇచ్చి కారవాన్ లోకి ఆహ్వానించారు.
రవితేజ కారవాన్ లోకి వెళ్తుండగా.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సాంగ్, మాస్ తో పెట్టుకుంటే సాంగ్ బీట్స్ వస్తాయి. ఆ తర్వాత డోర్ వెనుకనే ఉన్న దర్శకుడు బాబీ ముందుకు వచ్చి.. ‘మెగా మాస్ కాంబో బిగెన్స్’ అనడంతో టీజర్ ముగుస్తుంది. గతంలో చిరంజీవితో అన్నయ్య సినిమాలో రవితేజ తమ్ముడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శంకర్ దాదా జిందాబాద్ మూవీలోని ఓ సాంగ్ లో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి జత కడుతున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా విడుదల చేయనున్నారు.
రవితేజ నటించిన పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బాబీకి చిరంజీవిని డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో బాబీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. గ్లామర్ డాల్ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి ఈ మెగా మాస్ టీజర్ ని చూసిన మెగా మాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. “మెగా స్టార్మ్ తో మాస్ ఫోర్స్ జాయినయ్యింది. ఇక టాలీవుడ్ లో రికార్డుల మోతే” అంటున్నారు అభిమానులు. “ఇది కదా మాకు కావాల్సింది. ఇద్దరు అన్నయ్యలు ఒకే తెరపై కనపడుతుంటే అంతకంటే పెద్ద పండగ ఇంకేముంటుందని మురిసిపోతున్నారు. సంక్రాంతి పండగ ఎర్లీగా స్టార్ట్ అయ్యిందని” కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ మెగా మాస్ కాంబోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Laal Singh Chaddha Movie: మెగాస్టార్ సమర్పణలో ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ
ఇది కూడా చదవండి: మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న KGF-2