సంగీత దర్శకుడు కీరవాణి ఎప్పుడూ కూల్‌గా కనిపిస్తారు. ఆయన తనలోని భావోద్వేగాలను బయటకు చూపించరు. కానీ ఒక వీడియో చూశాక మాత్రం.. కీరవాణి కన్నీళ్లు ఆపుకోలేకపోయారట. అసలు ఏంటా వీడియో, దాని కథాకమామీషు ఏంటనేది తెలుసుకుందాం..
ప్రపంచ సినీ యవనికపై భారత్ మరోమారు సత్తా చాటింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. దీంతో రంగాలకు అతీతంగా ప్రముఖులు అందరూ మూవీ టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రపంచ సినిమాలో అత్యుత్తమ పురస్కారంగా భావించే ఆస్కార్‌ను దక్కించుకోవడం అంటే మాటలా మరి. ‘నాటు నాటు’కు అవార్డును ప్రకటించగానే ఆ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె కూడా సంతోషంలో ఏడ్చేసింది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ వేదికపై ట్రోఫీని అందుకోవడంతో భారతీయుల గుండె గర్వంతో ఉప్పొంగింది. అయితే ఇంత పెద్ద పురస్కారాన్ని గెలుచుకున్న క్షణంలోనూ కీరవాణి తన ఎమోషన్స్‌ను బయటపడనీయలేదు. కానీ ఒక వీడియో చూశాక మాత్రం ఆయన తనను తాను అదుపు చేసుకోలేకపోయారు. మరి.. దీని వెనుక ఉన్న కథ ఏంటంటే..
ఆస్కారు వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన తర్వాత మాట్లాడిన కీరవాణి.. తాను ప్రముఖ అమెరికన్ మ్యూజిషియన్ రిచెర్డ్ కార్పెంటర్ సాంగ్స్ వింటూ పెరిగానన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా రాజమౌళితో పాటు ‘నాటు నాటు’కు పనిచేసిన వారందరికీ ఒక పాట రూపంలో కృతజ్ఞతలు తెలిపారు. దీని కోసం కార్పెంటర్ బ్యాండ్‌కు సంబంధించిన ఐకానిక్ గీతం ‘ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్’ను వినియోగించారు. అయితే ఇప్పుడు ఏకంగా రిచర్డ్ కార్పెంటర్ నుంచే కీరవాణి, చంద్రబోస్ స్పెషల్ వీడియో అందుకున్నారు. ఈ ఇద్దరు ఆస్కార్ విన్నర్స్‌ను అభినందించేందుకు కార్పెంటర్ తన కుటుంబంతో కలసి ‘టాప్ ఆఫ్ ది వరల్డ్’ రిజిగ్డ్ వెర్షన్ పాడారు. ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కీరవాణి, చంద్రబోస్‌ను మెచ్చుకుంటూ కార్పెంటర్ పాడిన పాటపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. ‘సర్.. ఈ ఆస్కార్ క్యాంపెయిన్ అంతటా మా అన్నయ్య కీరవాణి చాలా ప్రశాంతంగా ఉన్నారు. పురస్కారం గెలవడానికి ముందు, ఆ తర్వాత కూడా ఆయన ఎప్పుడూ తన భావోద్వేగాలను బయట పెట్టలేదు. కానీ మీ వీడియో చూసిన తర్వాత ఆయన తన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఇది మా కుటుంబానికి మరపురాని క్షణం.. ధన్యవాదాలు’ అని కార్పెంటర్ ఇన్‌స్టా వీడియో పోస్ట్‌కు జక్కన్న రిప్లయ్ ఇచ్చారు. మరోవైపు కీరవాణి కూడా ఇది తాను ఊహించని విషయమన్నారు. ఆనందభాష్పాలు రాలుతున్నాయని చెప్పారు. యూనివర్స్ నుంచి అద్భుతమైన బహుమతి అని కీరవాణి పేర్కొన్నారు. ఈ వీడియోకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. ‘దిస్ ఈజ్ సో లవ్లీ’ అని కామెంట్ చేశారు.