టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ ఏడాది వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఆయన సోదరుడు రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే.. ఆయనకు మరో షాక్ తగిలింది. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి.. మృతి చెందింది. దీంతో ఘట్టమనేని ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ క్రమంలో తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అందంటంటే.. సూపర్ స్టార్ మహేష్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం జరిగిందని.. ఓ వ్యక్తి గోడ దూకి.. ఆయన నివాసంలో ప్రవేశించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మహేష్ తల్లి మృతి చెందడానికి ఒక రోజు ముందు ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
ప్రసుత్తం మహేష్ బాబు జూబ్లీ హిల్స్ రోడ్ నెం.81లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఒడిషాకు చెందిన కృష్ణ అనే వ్యక్తి.. మంగళవారం రాత్రి.. మహేష్ బాబు ఇంట్లో గోడ దూకి ప్రవేశించాడు. ఈ క్రమంలో అతడికి గాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో.. సెక్యూరిటీ వెళ్లి చూడగా.. వారికి.. గాయాలతో పడి ఉన్న కృష్ణ కనిపించాడు. వెంటనే సెక్యూరిటీ వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గాయపడ్డ కృష్ణను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే మహేష్ బాబు సినిమా హీరో కావడంతో.. ఆయనను చూడాలనే ఉద్దేశంతో సదరు వ్యక్తి ఇంత సాహసం చేశాడా.. లేక నిజంగానే దొంగతనం చేయడానికి వచ్చాడా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ 4 రోజలు క్రితమే హైదరాబాద్‌కు వచ్చి.. ఇక్కడ ఓ నర్సరీలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోలుకున్న తర్వాత పూర్తిస్థాయిలో విచారిస్తామని తెలిపారు.
ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే.. మహేష్ బాబు చిన్నప్పటి నుండి తల్లిచాటు బిడ్డలా పెరిగాడు. ఇందిరా దేవితో ఆయనకు ఎనలేని అనుబంధం, ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయి పద్మావతిని గల్లా జయదేవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. రెండో అమ్మాయి మంజుల నటిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ కూడా నటుడు. వీరిద్దరూ ఆరెంజ్ చిత్రంలో రామ్ చరణ్‌కు అక్కబావలుగా నటించారు. ఇక మూడో అమ్మాయి ప్రియదర్శిని హీరో సుధీర్ బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే.. మహేష్ అందరిలోకెల్లా చిన్నవాడు కావడంతో.. ఇందిరా దేవి ఆయనను ఎంతో గారాబం చేసింది. ఇక మహేష్ కూడా ఎక్కువ సమయాన్ని తన తల్లి దగ్గరే గడిపేవాడు.