సూపర్ స్టార్ కృష్ణ ఈ ప్రపంచాన్ని విడిచి పెట్టి పోయి రోజులు గడుస్తున్నాయి. రోజులు అయితే గడుస్తున్నాయి కానీ, కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఆ విషాదంలోంచి తేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న కృష్ణ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. కృష్ణ మరణానికి తనదైన శైలిలో నివాళులు అర్పించారు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్. ఏకంగా 345 కృష్ణ సినిమాల పేర్లతో కృష్ణ చిత్రాన్ని చిత్రీకరించారు.
14 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ షీట్ పై మైక్రో పెన్నుతో ఎక్కడా గీతలు లేకుండా ఈ చిత్రాన్ని వేశారు. 3 గంటల పాటు ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని గీశారు కోటేష్. ‘‘ సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినా, కోట్లాది అభిమానుల గుండెల్లో వారు శాశ్వతంగా ఉంటారని’’ కోటేష్ అన్నారు. కాగా, సూపర్ స్టార్ కృష్ణ సోమవారం గుండె పోటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కృష్ణకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆయన మరణించారు.
అదే రోజు ఉదయం ఆయన భౌతిక దేహాన్ని ఇంటికి తీసుకు వచ్చారు. అక్కడ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. సినిమాతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం కృష్ణకు నివాళులు అర్పించారు. కేసీఆర్, సీఎం జగన్, చిరంజీవి, పవన్ కల్యాణ్, మోహన్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ తదితరులు నివాళులు అర్పించారు. బుధవారం ఆయన పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోకు తీసుకెళ్లారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉంచారు. సాయంత్రం మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి.