సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలపై రోజురోజుకూ క్రేజ్ దేశవిదేశాలు దాటుతోంది. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ ఏ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదంటే.. కేజీఎఫ్ చాప్టర్ 2 అనే చెప్పాలి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతున్న కేజీఎఫ్-2 కి సంబంధించి ప్రమోషన్స్ ముమ్మరంగా జరుపుతోంది చిత్రబృందం. 2018లో ఎలాంటి అంచనాలు లేకుండా కేజీఎఫ్ మొదటి భాగం విడుదలై పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత కేజీఎఫ్ పార్ట్ 2 రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో కేజీఎఫ్-2 వరల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఒరిజినల్ కన్నడ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో కూడా ఊహించని రేంజిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిపినట్లు ఇండస్ట్రీ టాక్.ఇక తెలుగు రాష్ట్రాలలో(నైజాం, సీడెడ్, ఆంధ్రా ఏరియాలలో) కేజీఎఫ్-2 మూవీ.. 112 కోట్లకు పైనే బిజినెస్ జరిపిందని సమాచారం. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ తో రిలీజ్ అవుతున్న సినిమాలలో ఈ స్థాయి బిజినెస్ జరపడం అనేది మామూలు విషయం కాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. తెలుగులో డైరెక్ట్ మూవీకి జరిగినట్లే.. కేజీఎఫ్-2కి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. ప్రస్తుతం కేజీఎఫ్-2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ మాసివ్ మాఫియా మూవీకి అంచనాలకు మించి బిజినెస్ జరుగుతోందట. కర్ణాటకలో మొత్తం 180 కోట్ల మేరా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట కేజీఎఫ్-2.. ఇంత మొత్తంలో బిజినెస్ జరగటం ఇదే మొదటిసారి అంటున్నాయి కన్నడ సినీవర్గాలు. ఇక హిందీ విషయానికి వస్తే.. అక్కడ కూడా 100 కోట్లకు పైనే జరిగిందని.. తమిళనాడులో 40 కోట్లు, ఓవర్సీస్ లో 80 కోట్లు జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా కేజీఎఫ్-2 రూ. 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తుంది. మరి కేజీఎఫ్-2 పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.