కంటెంట్ ఉంటే ఏ భాషా చిత్రానికైనా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది మరోసారి రుజువైంది. కేజీఎఫ్, విక్రాంత్ రోణ చిత్రాల తర్వాత రీసెంట్ గా ‘కాంతార‘ చిత్రం తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కాంతార చిత్రం పట్ల జనాలు ఎంతటి ఆసక్తితో ఉన్నారనేది కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి.. హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలైంది. అయితే.. మొదటి షో నుండే పూర్తి పాజిటివ్ టాక్ వచ్చేసరికి.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులోకి డబ్ చేసి అక్టోబర్ 15న రిలీజ్ చేశారు.
ఇక కాంతార చిత్రంలో తెలిసిన నటులు ఎవరూ లేకపోయినా.. కేవలం కథాకథనాలతో జనాల్లో ఇంతటి ఆదరణ దక్కించుకోవడం విశేషం. సినిమాలో మ్యాటర్, ప్రెసెంటేషన్ కొత్తగా ఉంటే ఏ భాషా చిత్రాన్నైనా తెలుగు జనాలు అక్కున చేర్చుకుంటారు అనేది మరోసారి నిరూపితం అయ్యింది. కర్ణాటకకు చెందిన ఓ తెగ.. కంబళ, భూత కోలం అనే సాంప్రదాయాలను బేస్ చేసుకొని రూపొందిన ఈ చిత్రంలో ప్రేక్షకులు కోరుకునే మాస్ అంశాలన్నీ జోడించి హిట్ కొట్టేశారు మేకర్స్. అయితే.. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. ఇప్పటివరకు సినిమా వరల్డ్ వైడ్ రూ. 130 కోట్లు గ్రాస్ వసూల్ చేయడం జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. కాంతార తెలుగు థియేట్రికల్ హక్కులను నిర్మాత అల్లు అరవింద్ కేవలం రూ. 2 కోట్లకు సొంతం చేసుకొని రిలీజ్ చేశారు.
రిలీజ్ రోజునే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిన ఈ చిత్రం.. కేవలం మూడు రోజుల్లోనే డబుల్ బ్లాక్ బస్టర్ ని దాటి వసూల్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కాంతార మొదటి రోజు రూ. 2.10 కోట్లు, రెండో రోజు రూ. 2.80 కోట్లు షేర్ రాబట్టగా.. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ, రూ. 1.90 కోట్లు షేర్ కొల్లగొట్టడం మరో విశేషం. ఇక మూడు రోజులకు కలిపి కాంతార తెలుగులో రూ. 6.80 కోట్లు షేర్.. రూ. 13.5 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని సినీవర్గాలు చెబుతున్నాయి. దీంతో మూడు రోజుల్లోనే అల్లు అరవింద్ కి కాంతార.. రూ. 4.80 కోట్లు లాభాలు తెచ్చిపెట్టిందట. అదీగాక లాంగ్ రన్ ముగిసేసరికి కాంతార తెలుగులోనే 12 – 15 కోట్లపైనే షేర్ రాబట్టే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తానికి గీతా ఆర్ట్స్ వారు డబ్బింగ్ సినిమాతో అద్భుతమైన లాభాలను వెనకేస్తున్నారని సినీవర్గాలలో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి కాంతార మున్ముందు ఎలాంటి కలెక్షన్స్ నమోదు చేయనుందో!
#Kantara 3Days Telugu Collections
Towards Triple Block Buster💥💥👉AP&TG – 6.90CR (13.50CR Gross)
👉Telugu Break Even – 2CR
👉Profits – 4.90CR#RishabShetty #KantaraTelugu pic.twitter.com/ofQyHvTQLr— Masthi Movie (@MasthiMovie123) October 18, 2022