ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, పోలీసులు ఆదివారం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అధికారులు తెలిపిన మేరకు.. సినీనటి కరాటే కళ్యాణి గత కొన్నేళ్ళుగా అక్రమంగా పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుతొందని చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కు గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో చైల్డ్‌లైన్ అధికారులు ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌కాలనీలో శ్రీలక్ష్మినిలయం అపార్ట్‌మెంట్స్ లో సోదాలు చేపట్టారు. ఆ సమయంలో కల్యాణి, పిల్లలు ఇంట్లో లేరు. కల్యాణి తల్లి మాత్రమే ఉంది. ఆమె ఇంట్లో వుంటున్న చిన్నారి ఎవరన్న దానిపై ఆరా తీశారు. డిసెంబర్ 25న పుట్టిన పాపను 28న ఇంటికి తీసుకొచ్చిందని అమ్మాయి పేరు ‘మౌక్తిక’ అని ఆమె తెలిపారు. అయితే.. కళ్యాణి ఎక్కడి వెళ్లింది ? ఎప్పుడు వస్తుంది ? దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయాలను అటు అధికారులు, ఇటు పోలీసులు విచారిస్తున్నారు.
ఈ క్రమంలో పిల్లల దత్తత విషయమై నోటీసులు ఇచ్చినట్టుగా హైద్రాబాద్ కలెక్టర్ శర్మన్ తెలిపారు. అయితే కరాటే కళ్యాణి నుండి ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. ఇవాళ మరోసారి నోటీసు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. రేపటి వరకు ఈ నోటీసులపై స్పందించకపోతే కరాటే కళ్యాణిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. పిల్లలను దత్తత విషయంలో కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పిన కలెక్టర్.. వాటి ప్రకారమే దత్తత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చట్టానికి విరుద్దంగా వెళ్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Karate Kalyani: కరాటే కళ్యాణి ఇంట్లో పోలీసుల సోదాలు.. ఆ ఇద్దరు చిన్నారులు ఎవరు!
ఇక.. యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి, కరాటే కల్యాణి ఒకరిపై ఒకరు దాడిచేసుకున్న విషయం అందరకి తెలిసిందే. ప్రాంక్ వీడియోలు తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కల్యాణి, శ్రీకాంత్ ఇంటికి వెళ్లి అతడిని నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే అక్కడ గొడవ జరిగింది. తర్వాత శ్రీకాంత్ రెడ్డిపై కల్యాణి దాడి చేసింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు శ్రీకాంత్ తనపై కూడా దాడి చేసినట్టుగా కల్యాణి తెలిపింది. ఫ్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్‌రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.