దేశంలో ఇప్పడు ఎవరి నోట విన్నా ‘నాటు నాటు’ అనే పదమే వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మానియా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ మూవీలో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడంపై దేశ వ్యాపంగా ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆర్ఆర్ఆర్ టీమ్ కి సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా తెలుగు వారు అందరూ గర్వపడేలా ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచుతూ ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ కి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ టీమ్ కి అభినందన వెల్లువలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. విశ్వ సినీ వేదికపై తెలుగు చిత్రం సత్తా చాటిందని.. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఈ పాట తెలుగు సంస్కృతి, తెలుగు ప్రజల అభిరుచి, తెలుగు వాళ్ల ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టేలా ఉందని.. అందుకే అవార్డు వచ్చిందని అన్నారు.
తెలుగులు భాష గొప్పతనం, తెలుగు లోని మట్టి వాసనలను, ఘాటును ‘నాటు నాటు’ పాటతో వెలుగు లోకి తెచ్చిన తెలంగాణ ముద్దు బిడ్డ రచయిత చంద్రబోస్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. వెండితెరపై ‘నాటు నాటు’ సాంగ్ కి డ్యాన్స్ చేసి అందరిచే షభాష్ అనిపించుకున్న హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ప్రశంసలు కురిపించారు. ఇక దర్శకుడు రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని నలు దిశలా చాటి చెప్పారని.. ఆయన తీసిన సినిమాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఉందని అన్నారు. ఈ పాటకు సంగీతాన్ని అందించిన సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, గాయకులు రాహూల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ టీమ్, చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ఇతర సాంకేతిక సిబ్బందికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇక ఆర్ఆర్ఆర్ మూవీ సాంకేతిక విలువలు.. హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని.. అందుకే ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో సత్తా చాటిందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలు సాంకేతిక పరంగా హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందుతుండటం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. భారత దేశం గర్వించే స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని ఆనందం వ్యక్తం చేశారు. నాటు నాటు ఆస్కార్ తెలుగు నేలకు మాత్రమే కాదు దేశానికే గర్వకారణం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులు పండుగు చేసుకునే రోజు అని చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘ఉత్తమ ఒరిజనల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.#Oscars #RRR #NaatuNaatu pic.twitter.com/U4W16OT8Wo
— Telangana CMO (@TelanganaCMO) March 13, 2023