సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి కొత్త దర్శకులు వస్తూనే ఉంటారు. ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీసి స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాలు కూడా అందుకుంటారు. ఏదైనా దర్శకుడి టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అయితే.. ఈ మధ్యకాలంలో కొత్త దర్శకులు రావడంతో కొత్త కథలు, కొత్త సినిమాలు తెరపై అలరిస్తున్నాయి. ఇక ఒక్క సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించే దర్శకులు కూడా ఉన్నారు. తాజాగా అలా డెబ్యూ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మొదటిసారి ఓ సోషియో ఫాంటసీ నేపథ్యంలో బింబిసార సినిమా తెరకెక్కించాడు వశిష్ఠ. ఇటీవలే విడుదలైన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద విజయదుందుభి మోగిస్తోంది. సొంత బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మించి, నటించిన ఈ సినిమా అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం విశేషం. త్రిగర్తల సామ్రాజ్యాన్ని పరిపాలించే రాక్షస రాజు బింబిసారుడు.. టైమ్ ట్రావెల్ బేస్ చేసుకొని ఇప్పుడున్న కాలంలో అడుగుపెడితే ఎలా ఉంటుందో చూపించి ప్రేక్షకులను మెప్పించాడు వశిష్ఠ.
ఇక ఒక్క సినిమాతోనే వశిష్ఠ పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసరికి ఇప్పుడు అందరు హీరోలు కూడా అతనితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. తాజాగా వశిష్ఠ టాలీవుడ్ స్టార్ హీరో సినిమా అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. నటసింహం నందమూరి బాలకృష్ణ అని టాక్. అదికూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. బాలయ్యతో ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే షో నిర్వహిస్తున్నారు అల్లు అరవింద్.
బాలయ్యతో అన్ స్టాపబుల్ షో డీల్ చేసుకున్నప్పుడే ఓ సినిమా చేయాలని ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని సమాచారం. అయితే.. మంచి దర్శకుడు దొరికితే చూద్దామని వెయిట్ చేస్తున్న తరుణంలో బింబిసార మూవీతో వశిష్ఠ ఆకట్టుకున్నాడు. మొదటి సినిమా అయినప్పటికీ సినిమాను బాగా డీల్ చేయడంతో అల్లు అరవింద్.. బాలయ్య కోసం వశిష్ఠ అయితే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారట. మరి త్వరలోనే వశిష్ఠతో అల్లు అరవింద్ చర్చలు జరపనున్నాడని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో దీనిలో ఎంత వరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పుడు వశిష్ఠ వెలుగులోకి వచ్చేసరికి.. బింబిసార 2 తర్వాత అతనితో బాలయ్య సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. కానీ.. సినిమాను 2023 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి బాలయ్య – వశిష్ఠ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.