సినిమాలను సినిమాలుగానే చూడాలని.. పర్సనల్ గా తీసుకోవద్దని సినీ హీరోలే చెబుతుంటారు. అయినా వారి మాటలను అభిమానులు అసలు పట్టించుకోరు. పైగా సినిమా రిలీజైతే లేనిపోని గొడవలు, లేకపోతే రిలీజ్ అయ్యాక టికెట్ దొరకలేదని.. పక్క హీరో ఫ్యాన్ అవమానించాడని ఆత్యహత్యలు. ఇవన్నీ తెలుగు రాష్ట్రాలలో కాదు.. చచ్చేంత ఫ్యాన్ వార్స్ ఎక్కడ జరుగుతాయో తెలిసిందేగా. తమిళనాడులో అభిమాన హీరో సినిమా కోసం.. తల్లిదండ్రులు, భార్యా, పిల్లాపాపలను సైతం మర్చిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. స్టార్ హీరో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి.. ఆయన సినిమాని ప్రమోట్ చేయకపోయినా వచ్చే కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇటీవల సంక్రాంతి సందర్భంగా అజిత్ నటించిన ‘తెగింపు’ (తునివు) మూవీ భారీ స్థాయిలో విడుదలైంది. మిక్సెడ్ టాక్ తో కూడా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే.. సినిమా వరకు అంతా బాగానే ఉంది. కానీ.. సినిమా చూడనివ్వలేదని ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం కోలీవుడ్ లో, సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తూత్తుకుడి ఏరియాకి చెందిన వీరబాగు అనే వ్యక్తి హీరో అజిత్ కి వీరాభిమాని. అజిత్ కి సంబంధించి ప్రతి సినిమాని మొదటి షోనే చూసి.. ఎంజాయ్ చేస్తుంటాడు. ఈసారి తెగింపు సినిమాని ఫ్యామిలీతో చూసేందుకు థియేటర్ కి వెళ్ళాడు. అయితే.. వీరబాగు మద్యం సేవించి ఉండటంతో థియేటర్ యాజమాన్యం అతన్ని లోపలికి అనుమతించలేదు.
ఈ క్రమంలో వీరబాగుకి, థియేటర్ యాజమాన్యానికి చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో థియేటర్ మేనేజర్ రంగంలోకి దిగి.. వీరబాగుని అనుమతించమని తేల్చి చెప్పడమే కాకుండా అతన్ని అవమానిస్తూ కుటుంబసభ్యుల ముందే మాట్లాడాడు. ఆ తర్వాత వీరబాగుని బయటికి పంపించి.. అతని ఫ్యామిలీని లోపలోకి అనుమతించారు. ఇక ఫ్యామిలీ ముందే.. తన అభిమాన హీరో సినిమా విషయంలో అవమానం ఎదురైందని మనస్తాపానికి గురైన వీరబాగు.. నేరుగా అక్కడినుండి ఇంటికెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమా చూశాక ఇంటికెళ్లిన కుటుంబ సభ్యులు.. వీరబాగుని విగతజీవిగా చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించినట్లు తెలుస్తోంది. మరి ఇలా అభిమానం పేరుతో అవమానాలకు గురై.. ఆత్మహత్యలకు పాల్పడటం ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.