కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా విభిన్న రకాల పాత్రలు పోషిస్తూ.. ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెర మీదనే కాక.. రియల్‌గా కూడా అంటే టీవీ షోలలో, కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు బ్రహ్మాజీ. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గానే ఉంటాడు. అంతేకాక ఆయా సంఘటనలు, విషయాలపై కూడా స్పందిస్తూ ఫన్నీ పోస్ట్‌లు పెడుతుంటాడు. బ్రహ్మాజీ ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికి చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా తాజాగా బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ..” నేను తూర్పు గోదావరి జిల్లాలో పుట్టి.. పశ్చిమ గోదావరి జిల్లాలో పెరిగా. మా నాన్న తహసీల్దార్‌గా పని చేసేవారు. అప్పట్లో సీనియర్ నటుడు సోమయాజులు గారు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో చేశారు. అలా ఆయన నటించిన ‘శంకరాభరణం’ రిలీజై మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్‌తో సోమయాజులు గారికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. సినిమా భారీ విజయం నేపథ్యంలో ఆయనకు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నేను కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యాను. సోమయాజులకు గారికి దక్కిన గౌరవం చూసిన నాకు.. సినిమాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా అని అనిపించింది. ఎలాగైన ఇండస్ట్రీలోకి వెళ్లాలని అనుకుని, చదువు పూర్తయిన వెంటనే చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాను’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘అలా ఇన్స్టిట్యూట్లో నటన శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే నాకు కృష్ణవంశీ, రవితేజ, రాజా రవీంద్ర తదితరులతో పరిచయం ఏర్పడింది. ఇక కెరీర్ ప్రారంభంలో గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం వంటి సినిమాలతో నాకు మంచి గుర్తింపు, పాపులారిటీ వచ్చింది. తర్వాత పదేళ్లపాటు నేను సంతృప్తి చెందే పాత్రలు లభించలేదు. ఒకే తరహా పాత్రలు వచ్చాయి. ప్రస్తుతం మాత్రం కమెడియన్, సహాయ నటుడు, నెగెటివ్ షేడ్స్ వంటి విభిన్నమైన, మంచి మంచి పాత్రలు వస్తున్నాయి’’ అని తెలిపాడు. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశాడు బ్రహ్మాజీ.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”నాది ప్రేమ వివాహం. ఒక బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడింది. అయితే నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమె భర్త నుంచి విడిపోయి.. విడాకులు తీసుకుంది. అప్పటికే తనకు ఒక అబ్బాయి కుడా ఉన్నాడు. మా ప్రేమ గురించి చెప్తే మొదట ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ ఆమెను, అటు పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నాను. తనకు అప్పటికే బాబు ఉండగా మాకు మళ్లీ పిల్లలు ఎందుకు అని భావించి.. పిల్లలు వద్దనుకున్నాం. ఆ అబ్బాయే ఇప్పడు ‘పిట్టకథ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్డాడు” అంటూ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశాడు బ్రహ్మాజీ. మరి ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.