రెండు రోజుల క్రితమో, వారం క్రితమో టికెట్లు బుక్ చేసుకుంటే ఖాళీలు ఉండవు. వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. మనం వెళ్లే సమయానికి బెర్త్ దొరుకుతుందిలే అని అనుకుంటాం. కానీ పడుకోడానికి బెర్త్ కాదు కదా కనీసం కూర్చోడానికి సీటు కూడా దొరకదు. సర్లే ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి అని రాజీపడి ప్రయాణం చేస్తుంటాం. అయితే ఇక నుంచి వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ప్రయాణికుల సమస్యకు చెక్ పెట్టేందుకు ఐఆర్సీటీసీ పరిష్కారాన్ని తీసుకొచ్చింది.
పండగ సీజన్ లోనూ, రద్దీ సీజన్ లోనూ రైలు టికెట్ కన్ఫర్మ్ అయ్యిందంటే అంతకంటే ఆనందం ఆ ప్రయాణికులకు మరొకటి ఉండదు. టికెట్ బుక్ చేసిన చాలా మందికి వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంటుంది. అదృష్టం ఉన్న వారికి చాలా తక్కువ మందికి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు భారతీయ రైల్వే పరిష్కారాన్ని తీసుకొచ్చింది. అదే ఐఆర్సీటీసీ వికల్ప్ స్కీం. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు బెర్త్ కన్ఫర్మ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్నే అల్టర్నేటివ్ ట్రైన్ అకామడేషన్ స్కీం అని కూడా అంటారు. మనం ప్రయాణించే రైలులో బెర్త్ లు ఖాళీ లేనప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో టికెట్ తీసుకుంటాం.
కన్ఫర్మ్ అయిన ప్రయాణికులు ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ సీటుని వెయిటింగ్ లిస్టులో ముందు వరుసలో ఉన్న ప్రయాణికుడికి కేటాయిస్తారు. అయితే చివరి వరకూ టికెట్ కన్ఫర్మ్ కాదనుకునే సందర్భంలో వికల్ప్ స్కీం ఉపయోగపడుతుంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఈ వికల్ప్ స్కీం ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఈ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల అదే మార్గంలో ప్రయాణిస్తున్న వేరే రైళ్లలో బెర్త్ లు ఖాళీగా ఉంటే అందులో ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. ఒకే మార్గంలో వేరే రైళ్లు వెళ్తుంటే.. ఆ రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటే వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి ఖాళీ లేని రైలు దిగి సీటు ఖాళీగా ఉన్న రైలు ఎక్కి ప్రయాణించే సౌలభ్యాన్ని రైల్వేశాఖ వికల్ప్ స్కీం ద్వారా కల్పిస్తుంది.
ఇది కాకుండా వేరే ఆప్షన్ కూడా ఉంది. ఆటోమేటిక్ అప్ గ్రేడ్ అనే ఆప్షన్ ని టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఎంచుకోవాలి. ఉదాహరణకు స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే.. అందులో ఖాళీలు లేకపోతే ఆటో అప్ గ్రేడ్ ఆప్షన్ ని ఎంచుకోవడం ద్వారా స్లీపర్ కంటే పై క్లాస్ లో బెర్తులు ఖాళీగా ఉంటే అందులో ప్రయాణం చేయవచ్చు. థర్డ్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లో బెర్తులు ఖాళీగా ఉంటే ప్రయాణం చేసే వీలు ఉంటుంది. దీనికి టికెట్ బుక్ చేసుకునే ముందు ఆటో అప్ గ్రేడ్ ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఖాళీ బెర్తులతో రైళ్లు వృధాగా పోవడం ఎందుకని.. ఆ బెర్తులను ఇలా టికెట్ కన్ఫర్మ్ అవ్వనివారి కోసం ఉపయోగపడేలా రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. వికల్ప్ స్కీం ఆప్షన్ ని ఎంచుకున్న వారికి ఆటో అప్ గ్రేడ్ ఆప్షన్ అమలు అవుతుంది.