ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ ల వరకు అంతా ఉద్యోగులను ఇళ్లకు పంపుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియ ఈ ఏడాది ఉంటుందని స్పష్టం చేసింది. మరి అసలు స్మార్ట్ హైరింగ్ అంటే ఏంటి? ఈ విధానంలో ఉద్యోగం పొందేందుకు ఎవరు అర్హులు? పరీక్ష, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది? ముఖ్యమైన తేదీలు ఏంటి? అనే పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మందికి సాఫ్ట్ వేర్ జాబ్ చేయడం అనేది కల. కానీ, నాన్ బీటెక్ విద్యార్థులు సాఫ్ట్ వేర్ జాబ్ కొట్టడం అనేది సాధ్యమయ్యే పనికాదు. అవకాశాలు కూడా ఉండేవి కాదు. పైగా క్యాంపస్ సెలక్షన్స్ కూడా నాన్ బీటెక్ విద్యార్థులకు ఉండేవి కావు. ఇప్పుడు టీసీఎస్ సైన్స్ టూ సాఫ్ట్ వేర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంటే ఆఫ్ క్యాంపస్ నియామక ప్రక్రియనే స్మార్ట్ హైరింగ్ అంటారు. దీని ద్వారా నాన్ బీటెక్ బ్యాగ్రౌండ్ విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కల్పిస్తుంటారు. ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు.
నిజానికి క్యాంపస్ సెలక్షన్ ప్రక్రియ పూర్తికావడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుంది. ఆ విధానం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు కంపెనీకి కూడా సమయం వృథా అవుతోందని భావించే ఈ స్మార్ట్ హైరింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనిలో గణితం, స్టాటిటిక్స్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో బీఎస్సీ, బీసీఏ, ఐటీ/సీఎస్ వంటి ఒకేషనల్ కోర్సుల్లో చివరి సంవత్సరం విద్యార్థుల కోసమే ఈ స్మార్ట్ ప్రక్రియ.
2023లో వాళ్లు చెప్పిన గ్రూపుల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకోనున్న విద్యార్థులు అర్హులు. టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు 50 శాతం మార్కులు లేదా 5 సీజీపీఏతో పాసై ఉండాలి. డిగ్రీలో మాత్రం ఒక బ్యాక్ లాగ్ కి మించి ఉండకూడదు. అలాగే చదువులో రెండేళ్ల కంటే ఎక్కువ విరామం ఉండకూడదని చెప్పింది. ఇంక అప్లై చేయాలనుకునే విద్యార్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 28 ఏళ్లలోపే ఉండాలని పేర్కొంది. ఈ స్మార్ట్ హైరింగ్ లో దాదాపు 40 వేల వరకు ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకుంటారు.
ఈ సంఖ్య ఎంత అనేది పూర్తిగా కంపెనీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దేశవ్యాప్తంగా దాదాపు 2 వేల ఇన్ స్టిట్యూట్ల నుంచి విద్యార్థులకు ఈ పరీక్షలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ లో అర్హత సాధించిన వారికి ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారు. ప్రోగ్రామింగ్, కోడింగ్, ఇండస్ట్రీ 4.0, సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, బిహేవియర్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత వారి ఆసక్తి మేరకు ఐటీ లేదా బీపీఎస్ లో అవకాశం కల్పిస్తారు. ఇంక ప్రారంభ జీతం ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది.
ఈ టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ విధానం 3 దశల్లో జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్, టెక్నికల్ రౌండ్, హెచ్ ఆర్ రౌండ్ ఉంటాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మళ్లీ 3 విభాగాలు ఉంటాయి. వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరిక్ ఎబిలిటీ అని 3 విభాగాలు ఉంటాయి. ఒక్కో కేటగిరీ నుంచి 15 నుంచి 20 ప్రశ్నల వరకు అడుగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరీక్షకు 50 నిమిషాల సమయం ఇస్తారు. దీనిలో కంపెనీ పెట్టుకున్న కటాఫ్ మార్కులు సాధించిన వారికి టెక్నికల్ రౌండ్ కు అవకాశం ఉంటుంది. అక్కడ కూడా సెలక్ట్ అయితే తర్వాత హెచ్ ఆర్ రౌండ్ కి అర్హత సాధిస్తారు.
ఈ హైరింగ్ లో పాల్గొనాలి అనుకునే వాళ్లు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://nextstep.tcs.com/campus/#/ ఇక్కడ ఔత్సాహికులు లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఐటీ లేదా బీపీఎస్ మీకు ఏది ఇంట్రస్ట్ అయితే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓ ఆన్ లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి. వారు కోరిన డాక్యుమెంట్లు కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తునకు జనవరి 31 చివరి తేదీగా చెబుతున్నారు. ఫిబ్రవరి 10న ఆన్ లైన్ టెస్ట్ నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం https://www.tcs.com/careers/india/tcs-smart-hiring-2023 వెబ్ సైట్ ని సందర్శించండి.